Telangana Congress: టీపీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్.. అవకాశం ఇస్తే తడాఖా చూపిస్తానంటున్న కోమటిరెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో రచ్చ మొదలైంది. టీపీసీసీ చీఫ్ పదవికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా రాజీనామా చేశారో లేదో.. అప్పుడే ఆ పదవి కోసం కొందరు..

Telangana Congress: టీపీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్.. అవకాశం ఇస్తే తడాఖా చూపిస్తానంటున్న కోమటిరెడ్డి..
MP Komatireddy Venkat Reddy (File Photo)

Updated on: Dec 05, 2020 | 1:16 PM

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో రచ్చ మొదలైంది. టీపీసీసీ చీఫ్ పదవికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా రాజీనామా చేశారో లేదో.. అప్పుడే ఆ పదవి కోసం కొందరు లాబీయింగ్ ముమ్మరం చేశారు. పీసీసీ చీఫ్ పదవికి తామే అర్హులమంటూ ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీపీసీసీ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ రేస్‌లో తానే ముందున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి సైతం త్యాగం చేశానని గుర్తు చేశారు. తనకు పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే తన తడాఖా ఏంటో చూపిస్తానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శక్తులను ఏకతాటిపైకి తెచి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేస్తానని అన్నారు.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. ఉత్తమ్ రాజీనామాతో టీపీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. రేపు సాయంత్రానికల్లా కొత్త టీపీసీసీ చీఫ్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారిక సమాచారం అందుతోంది. అయితే, టీపీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలంతా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఆ పదవికి తాము అర్హులమంటే.. తామే అర్హులమని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే పీసీసీ రేస్‌లో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి అధిష్టానం ఆ పదవిని ఎవరికి కట్టబెడుతోందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.