ఇతరులతో ఆదాయ వివరాలను పంచుకోవడం మనలో చాలా మందికి ఇష్టం ఉండదు. ఎక్కువ మంది ఈ విషయంలో అత్యంత గోప్యత పాటిస్తారు. అయితే వైవాహిక వివాదాల విషయంలో ఒక వ్యక్తి తన ఆదాయ వివరాలను భార్యతో పంచుకోవలసి ఉంటుంది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు పలు కేసుల్లో భర్తల ఆదాయ వివరాలను తెలుసుకునే హక్కు భార్యలకు ఉంటుందని తీర్పులు ఇచ్చాయి. తాజాగా సంజు గుప్తా అనే మహిళ తన జీవిత భాగస్వామి ఆదాయ వివరాలను కోరుతూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దాఖలు చేశారు. మొదట్లో భర్త అంగీకారం లేనందున ఈ వివరాలు ఆర్టీఐ ద్వారా ఇచ్చేందుకు బరేలిలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) నిరాకరించారు. దీనిపై అసంతృప్తి చెందిన సదరు మహిళ మొదటి అప్పీలేట్ అథారిటీ ముందు అప్పీల్ చేశారు.
సీపీఐవో నిర్ణయాన్ని మెదటి అప్పిలేట్ అథారిటీ కూడా సమర్థించింది. దీంతో భర్త ఆదాయ వివరాల కోసం సంజు గుప్తా జాతీయ సమాచార కమిషన్ (సీఐసీ)ను ఆశ్రయించింది. తన భర్త ఆదాయ వివరాలను ఇచ్చేలా సీపీఐవో ఆదేశాలివ్వాలని జాతీయ సమాచార కమిషన్‌ను కోరినట్లు ది ఫినాన్సియల్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనంలో వెల్లడించింది.
ఈ విషయమై సుప్రీంకోర్టు, హైకోర్టులు గతంలో ఇచ్చిన కొన్ని తీర్పులను జాతీయ సమాచార కమిషన్(సీఐసీ) పరిశీలించింది. సంజు గుప్తా అభ్యర్థనపై సెప్టెంబర్ 19, 2022న తన ఆర్డర్‌ను ఇచ్చింది. 15 రోజుల్లోగా పబ్లిక్ అథారిటీ వద్ద అందుబాటులో ఉన్న తన భర్త యొక్క నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం/స్థూల ఆదాయం వివరాలను భార్యకు అందించాలని కమిషన్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌ని ఆదేశించింది.
భర్త ఆదాయ వివరాలను పొందే అర్హత భార్యకు ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆదేశాలిచ్చాయని జాతీయ సమాచార కమిషన్ తన ఉత్తర్వుల్లో గుర్తుచేసింది. ఈ ఉత్తర్వులతో వైవాహిక వివాదాల విషయంలో భర్త తమ ఆదాయ వివరాలను భార్యకు ఇవ్వాల్సిందేనని తేటతెల్లం అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తలు చదవండి..