
ఆమడ దూరంలో పాము కనిపిస్తేనే చాలా మంది భయంతో పరుగు లంకించుకుంటారు. అలాంటిది విషపూరితమైన పెద్ద పాము మీ పక్కనే, లేదంటే మీరు కూర్చున్న సీటు కిందనే ఉంటే ఏం చేస్తారు. ఊహకే వెన్నులో వణుకు పుడుతుంది కదూ.. ఓ మహిళ నిజంగానే భయంకరమైన విష సర్పంతో స్కూటిపై 5 కిలోమీటర్ల వరకు ప్రయాణించింది. తన స్కూటర్లో విషపూరిత పాము ఉందనే విషయం తెలియకుండానే ఆమె ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసిందో కాలేజీ టీచరమ్మ. అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి హానీ కలగకుండానే ప్రాణాలతో బయటపడింది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో అక్టోబర్ 30 (గురువారం) జరిగింది. అసలేం జరిగిందంటే..
కేరళలోని తైకదప్పురానికి చెందిన షర్ఫునిసా అనే మహిళ నెహ్రూ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. ఆమె రోజు తన స్కూటర్‌పై కాలేజీకి వెళ్తుంటుంది. రోజూలాగే ఉదయాన్ని కాలేజీకి బయల్దేరింది. హెల్మెట్ పాటు షూలను చెక్ చేసుకుని స్కూటర్‌పై కాలేజీకి బయలుదేరింది. అలా రోడ్డుపై 5 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత బ్రేక్ పెడల్ దగ్గర ఏదో కదులుతున్నట్లు కనిపించింది. వెంటనే స్కూటీని రోడ్డు పక్కన ఆపుజేసి కిందకు దిగి కాస్త నిశితంగా పరిశీలించింది. అంతే గుండె ఆగినంత పనైంది. తన స్కూటీలో పెద్ద సైజులో ఓ విషపూరితమైన పాము కనిపించింది. దానిని చూసిన ఆమె ఒక్కసారిగా పరేషానైంది. తాను కొద్దిగా చేతులను కదిలించినా పాము కాటు వేసేదని, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయపడినట్లు వెల్లడించింది.
అయితే పామును స్కూటర్ నుంచి బయటకు తీసేందుకు షర్ఫునిసాకు ధైర్యం సరిపోలేదు. పైగా అది ట్రాఫిక్ అధికంగా ఉండే స్థలం కావడంతో తాను ఏ మాత్రం భయపడినా పెద్ద ప్రమాదమే జరిగేది. దీంతో కాస్త ధైర్యాన్ని కూడబెట్టుకుని మెల్లగా ఎలాగోలా కాలేజీ వరకు వెళ్లింది. వెంటనే దగ్గర్లోని మెకానిక్‌కు కాల్ చేసి స్కూటర్ భాగాలను విప్పించడంతో.. అందులోని విషపూరిత పాము బయటకు వచ్చింది. అంతపెద్ద పామును చూసిన అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. తన అదృష్టం బాగుండి బతికిపోయానని, లేదంటే ఏం జరిగేదో ఊహించలేనని తన అనుభవాన్ని తెలిపింది. పామును బయటకు తీసిన తర్వాతనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పానని షర్ఫునిసా తెలిపింది. కాగా చలికాలం సమీపిస్తున్న క్రమంలో వెచ్చదనం కోసం కోబ్రా, రక్తపింజర వంటి విషపూరిత పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. పైగా అక్టోబర్ నుంచి జనవరి వరకు పాములు చాలా యాక్టివ్‌గా ఉంటాయి. కాబట్టి ఇల్లు, పరిసరాలు మాత్రమే కాకుండా షూలు, వాహనాలు కూడా పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.