Viral: ఫ్రీజర్ నుంచి పదే పదే ‘బీప్’ శబ్దం.. చిరాకుపడిన క్లీనర్ ఏం చేశాడో తెలిస్తే.?
ల్యాబ్‌లోని ఫ్రీజర్ నుంచి పదే పదే ‘బీప్’ శబ్దం వస్తోందని చిరాకు పడిన ఓ క్లీనర్.. చేసిన నిర్వాకం ఓ ప్రైవేట్ రీసెర్చ్ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది.
ల్యాబ్‌లోని ఫ్రీజర్ నుంచి పదే పదే ‘బీప్’ శబ్దం వస్తోందని చిరాకు పడిన ఓ క్లీనర్.. చేసిన నిర్వాకం ఓ ప్రైవేట్ రీసెర్చ్ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది. అక్కడి పరిశోధకుల రెండు దశాబ్దాలకుపైగా శ్రమను బూడిదపాలు చేస్తూ.. 8 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ట్రాయ్ ప్రాంతంలో రెన్‌సీలేర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ ల్యాబ్ ఉంది. అందులోని ఓ ఫ్రీజర్‌లో ‘కిరణజన్య సంయోగక్రియ’ ప్రక్రియకు సంబంధించిన నమూనాలను, ఇతర మూలకాలను మైనస్ 112 డిగ్రీల వద్ద భద్రపరిచారు.
అయితే, ఆ ఫ్రిజర్ నుంచి నిత్యం బీప్ శబ్దం వస్తుండటంతో విసుగెత్తిపోయిన అక్కడి క్లీనర్.. దాని స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో లోపలున్న కూలింగ్ తగ్గిపోయింది. ఫలితంగా అందులో నిల్వచేసిన నమూనాలు దెబ్బతిన్నాయి. దీంతో నమూనాలను భద్రపరిచిన పరిశోధకులు తమ 20 ఏళ్ల శ్రమ వృథా అయిందని వాపోయారు. ఈ ఘటన దాదాపు మూడేళ్ల క్రితం చోటుచేసుకున్నా.. ఇటీవల ఆ క్లీనర్‌ను నియమించిన క్లీనింగ్ సర్వీస్‌పై దావా వేసింది. ‘వార్నింగ్ సైన్‌లు ఉన్నప్పటికీ.. కొందరి అనుచిత ప్రవర్తన కారణంగా ఈ ఘటన జరిగిందని ఫలితంగా 25 ఏళ్ల పరిశోధన తుడిచిపెట్టుకుపోయింది’ అని పరిశోధన సంస్థ తరఫు న్యాయవాది తెలిపారు.