
భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, కొన్ని రోజులు మౌనం పాటించడం సహజమే. కానీ ఒకే ఇంట్లో ఉంటూ, ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి కూడా ఏకంగా 20 సంవత్సరాల పాటు భార్యతో ఒక్క మాట కూడా మాట్లాడని భర్త గురించి ఎప్పుడైనా విన్నారా? జపాన్‌లో జరిగిన ఈ విచిత్రమైన ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జపాన్‌కు చెందిన ఒటో కటాకియమా, ఆయన భార్య యుమి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. ఒటో తన పిల్లలతో చాలా సంతోషంగా, సాధారణంగానే మాట్లాడేవాడు. కానీ తన భార్య యుమి వైపు మాత్రం కనీసం కన్నెత్తి చూసేవాడు కాదు, ఆమె ఎన్నిసార్లు మాట్లాడటానికి ప్రయత్నించినా సైగలు చేయడం లేదా తల ఊపడం తప్ప నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. ఇలా ఏడు కాదు.. పది కాదు.. ఏకంగా 20 ఏళ్ల పాటు ఆయన తన భార్యతో మౌనవ్రతాన్ని కొనసాగించాడు.
తమ చిన్నతనం నుంచే తండ్రి, తల్లితో మాట్లాడకపోవడాన్ని గమనించిన వారి 18 ఏళ్ల కొడుకు యోషికీ, ఈ సమస్యకు ఎలాగైనా ముగింపు పలకాలనుకున్నాడు. దీనికోసం ఒక ప్రముఖ జపనీస్ టీవీ షో సాయం కోరాడు. టీవీ షో నిర్వాహకులు దంపతులిద్దరినీ వారు మొదట కలుసుకున్న ఓ అందమైన పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ పిల్లలందరూ రహస్యంగా నిలబడి గమనిస్తుండగా.. 20 ఏళ్ల తర్వాత ఒటో తన భార్యతో నోరు విప్పి మాట్లాడాడు. ‘‘నువ్వు పిల్లల పెంపకంలో ఎంతో శ్రమించావు. నా ఓపిక లేకపోవడాన్ని భరించావు. ఇన్నాళ్లూ నాతో ఉన్నందుకు చాలా ధన్యవాదాలు.. అని ఒటో చెప్పగానే ఆ క్షణం భార్య యుమితో పాటు వారి పిల్లలు కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
అసలు భార్యపై అంత కోపం, అలక ఎందుకని టీవీ షోలో ఒటోను ప్రశ్నించగా.. ఆయన చెప్పిన కారణం విని అందరూ ఆశ్చర్యపోయారు. తన భార్య యుమి పిల్లలపై ఎక్కువ శ్రద్ధ, ప్రేమ చూపుతుందని.. తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని అసూయ పెంచుకున్నాడట.. భార్య ప్రేమ అంతా పిల్లలకే దక్కుతుందన్న చిన్నపిల్లాడి లాంటి అసూయతోనే ఆయన 20 ఏళ్ల పాటు ఆమెతో మాట్లాడటం మానేశానని ఒప్పుకున్నాడు.
కాగా చిన్నపాటి అసూయ, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఏకంగా రెండు దశాబ్దాల కాలాన్ని ఆ దంపతులు మౌనంతోనే గడిపేశారు. చివరికి కొడుకు చేసిన ప్రయత్నం ఫలించి, ఆ దంపతులు మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభించడం విశేషం.