
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఈ నెట్‌వర్క్‌లో ఎన్నో ఐకానిక్ స్టేషన్లు ఉన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జంక్షన్ (Howrah Junction) స్థానం ప్రత్యేకం. హుగ్లీ నది తీరాన గంభీరంగా నిలిచే ఈ స్టేషన్, కేవలం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదు, ఒక సజీవ చరిత్ర. హౌరా స్టేషన్ ప్రయాణం 1854, ఆగస్టు 15న ప్రారంభమైంది. మొదటి రోజున ఒక ఇంజిన్, మూడు బోగీలతో కూడిన రైలు ఇక్కడి నుండి హూగ్లీ వరకు నడిచింది. అప్పట్లో కేవలం ఒకే ఒక ప్లాట్‌ఫారమ్ ఉండేది. కానీ కాలక్రమేణా ప్రయాణికుల రద్దీ పెరగడంతో స్టేషన్‌ను విస్తరిస్తూ వచ్చారు. నేడు మనం చూస్తున్న ఈ భారీ ఎర్రటి భవనం 1905లో బ్రిటీష్ ఆర్కిటెక్ట్ హాల్సే రికార్డో రూపొందించిన డిజైన్ ప్రకారం నిర్మించబడింది.
హౌరా జంక్షన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ మొత్తం 23 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. భారతదేశంలో ఏ ఇతర రైల్వే స్టేషన్‌లోనూ ఇన్ని ప్లాట్‌ఫారమ్‌లు లేవు. వీటితో పాటు 26 రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ఈ స్టేషన్ ద్వారా ప్రతిరోజూ వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. లోకల్ ట్రైన్స్ నుండి మొదలుకొని రాజధాని, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్ల వరకు అన్నీ ఇక్కడి నుండి నడుస్తాయి.
కోల్‌కతా నగరానికి గుండెకాయ వంటి హౌరా స్టేషన్ నుండి ప్రతిరోజూ దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని అంచనా. స్టేషన్ వెలుపల ఉండే ప్రసిద్ధ హౌరా బ్రిడ్జ్ ఈ ప్రాంతానికి మరింత శోభను ఇస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ విశాలమైన వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్ట్స్, మ్యూజియం కూడా ఉన్నాయి.
170 ఏళ్లు దాటినా హౌరా స్టేషన్ తన పురాతన కళను కోల్పోకుండా ఆధునిక హంగులను అద్దుకుంటోంది. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో కూడా ఈ స్టేషన్‌ను అనుసంధానిస్తూ నిర్మించడం విశేషం. ఇంజనీరింగ్ అద్భుతానికి, చారిత్రక వారసత్వానికి హౌరా జంక్షన్ ఒక నిలువెత్తు సాక్ష్యం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..