మాంసం తినేవారు ఎవరైనా కూడా దాన్ని సరిగ్గా ఉడికించుకుని తినాలని వైద్యులు అంటుంటారు. ఇక పచ్చిగా మాంసం తిన్నట్లయితే.. లేనిపోని రోగాలు రావడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. సరిగ్గా అలాంటి ఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది. 23 ఏళ్ల యువతి 10 సంవత్సరాలుగా పచ్చి పంది మాంసం తిని చివరికి ఆస్పత్రిపాలయ్యింది. ఆమెకు MRI, CT స్కాన్‌లు చేసిన డాక్టర్లు.. వాటిని చూసి దెబ్బకు బిత్తరపోయారు. ప్రస్తుతం ఆ ఎక్స్‌రే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ స్టోరీ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని డెకిన్ కౌంటీ యుబెంగ్ విలేజ్‌కు చెందిన 23 ఏళ్ల యువతి 10 ఏళ్లుగా పచ్చి పంది మాంసం తినేది. 2016లో ఆమె తొడలు, కళ్లనొప్పితో పాటు తలనొప్పితో ఆస్పత్రిలో చేరింది. వైద్యులు సదరు యువతికి MRI, CT స్కాన్ చేయగా.. కనిపించింది చూసి దెబ్బకు దడుసుకున్నారు. ఆ యువతి సిస్టిసెర్కోసిస్(Cysticercosis) అనే వ్యాధితో బాధపడుతుండగా.. ఆమె ఒంటి నిండా టేప్‌వార్మ్ గుడ్లు నిండి ఉన్నాయి. కండరాలు, ఉదరం, కళ్లు, మెదడు.. ఇలా అన్ని శరీరభాగాల్లోనూ పరాన్నజీవులు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. సదరు యువతి యుక్తవయస్సులో ఉన్నప్పటి నుంచి పచ్చి పంది మాంసాన్ని తినేదని తేలింది.
రోగికి ఉబ్బిన కళ్లు, రెటీనా నుంచి రక్తస్రావం, శరీరం అంతటా ఇన్ఫెక్షన్లు, మూర్చతో బాధపడుతోందని ప్రొవిన్షియల్ ఫస్ట్ హాస్పిటల్‌లోని న్యూరాలజీ విభాగానికి చెందిన చీఫ్ ఫిజిషియన్ ప్రొఫెసర్ మెంగ్ కియాంగ్ వెల్లడించారు. పరాన్నజీవి పురుగులు మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని.. నాడీ వ్యవస్థను దెబ్బ తీస్తాయన్నారు. శరీరంలోకి చేరిన పరాన్నజీవులు చనిపోతే ఇన్‌ఫ్లమేటరీ సమస్యలు, తీవ్రమైన అలెర్జీ లాంటి సమస్యలు వస్తాయన్నారు. పందులు, బోవిన్ లాంటి జంతువుల పచ్చి మాంసం తినడం ద్వారా ఈ సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి సోకుతుందని డాక్టర్లు అన్నారు. ఆ మాంసంతో టేప్ వార్మ్‌లు ఇంటర్మీడియట్ హోస్టులుగా మనిషి శరీరంలోకి చేరుతాయని డాక్టర్లు అన్నారు. పరిశుభ్రత నియమాలు తరచుగా విస్మరించే దేశాల్లో ఈ సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి ఎక్కువగా ప్రబలుతుందని డాక్టర్ చెప్పారు. సిస్టిసెర్సీ మనిషి శరీరంలోని ఏ అవయవానికైనా సోకుతుందని.. దీని ప్రభావం మెదడుపై తీవ్రంగా ఉంటుందన్నారు. న్యూరోసిస్టిసెర్కోసిస్ వల్ల సంవత్సరానికి 50,000 మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్ తెలిపారు.(Source)
ఇది చదవండి: మీరు మాట్లాడే విధానం.. మీరు ఎలాంటి వారో చెప్పేస్తుంది.! ఎలాగంటే
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..