AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల ప్రాణత్యాగం గురించి తెలిస్తే..

బుద్ధుని విగ్రహాల్లో కనిపించేది నిజంగా రింగుల జుట్టేనా? లేక దాని వెనుక ఎవరికీ తెలియని ఒక కదిలించే రహస్యం దాగుందా? సన్యాసిగా మారి గుండు చేసుకున్న బుద్ధుడి తలపైకి ఆ రింగుల ఆకారం ఎలా వచ్చింది? నిజానికి ఆయన తలపై ఉన్నవి వెంట్రుకలు కావు.. బుద్ధుని ధ్యానం కోసం ప్రాణత్యాగం చేసిన 108 నత్తలు.. వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉన్న ఈ ఉదంతం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల ప్రాణత్యాగం గురించి తెలిస్తే..
Gautama Buddha Hair MysteryImage Credit source: AI Image
Krishna S
|

Updated on: Sep 16, 2026 | 7:37 PM

Share

ప్రపంచవ్యాప్తంగా శాంతి, దయ, అహింసలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. బుద్ధుని విగ్రహాలు లేదా చిత్రపటాలను గమనిస్తే.. ప్రశాంతమైన ముఖంతో పాటు ఆయన తలపై గుండ్రంగా, రింగులు రింగులుగా ఏదో కనిపిస్తుంది. చాలామంది దీనిని బుద్ధుడి రింగుల జుట్టు అనుకుంటారు. కానీ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం.. అది జుట్టు కాదు… ఆయన తలపై ప్రాణాలు అర్పించిన 108 నత్తలని ఒక ప్రసిద్ధ కథ చెబుతుంది. ఈ కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు చాలా మందికి తెలియవు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో నేపాల్‌లోని లుంబినీ వనంలో శాక్య వంశపు రాజు శుద్ధోదనుడు, మాయాదేవి దంపతులకు సిద్ధార్థుడు జన్మించాడు. పుట్టిన కొద్ది రోజులకే తల్లి చనిపోవడంతో, ఆమె సోదరి గౌతమి ఆయనను పెంచి పెద్ద చేసింది. అందుకే ఆయనకు గౌతముడు అనే పేరు వచ్చింది.

రాజభోగాల త్యాగం

సిద్ధార్థునికి 16 ఏళ్ల వయసులో యశోధరతో వివాహం జరిగింది. వీరికి రాహులుడు అనే కుమారుడు జన్మించాడు. సకల రాజభోగాలు, విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ.. మానవ జీవితంలో ఎదురయ్యే రోగాలు, వృద్ధాప్యం, మరణం వంటి బాధలు ఆయనను తీవ్రంగా కలచివేశాయి. వీటన్నింటికీ మూలకారణం, పరిష్కారం కనుగొనడానికి తన 29వ ఏట రాజ్యాన్ని, కుటుంబాన్ని వదిలి సన్యాసం స్వీకరించాడు. సిద్ధార్థుడి జీవితంలో వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. ఆయన జన్మించింది, 35వ ఏట బీహార్‌లోని గయలో బోధి చెట్టు కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారింది, అలాగే 80వ ఏట మరణం చెందింది కూడా వైశాఖ పౌర్ణమినాడే.

సన్యాసిగా మారినప్పుడు గుండు చేసుకుంటే.. విగ్రహాల్లో రింగులేంటి?

సన్యాసం తీసుకున్న వెంటనే సిద్ధార్థుడు తన పొడవైన జుట్టును పూర్తిగా తీసేసి గుండు చేసుకున్నాడు. బౌద్ధ సంప్రదాయంలో సన్యాసులు జుట్టు పూర్తిగా తొలగించడం ఒక నియమం. మరి విగ్రహాలలో ఆయన తలపై రింగుల ఆకారం ఎందుకు కనిపిస్తుంది? దీని వెనుక ఒక కదిలించే గాథ ఉంది. ఓ రోజు మధ్యాహ్నం బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని గాఢమైన ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన ధ్యాన సమాధిలో ఎంతగా లీనమైపోయాడంటే, సమయం గడిచేకొద్దీ చెట్టు నీడ పక్కకు వెళ్లిపోయి నడినెత్తిపై తీవ్రమైన ఎండ పడుతున్న విషయాన్ని కూడా గమనించలేదు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక నత్త బుద్ధుడిని చూసింది. ప్రచండమైన ఎండ వేడికి ఆయన తల మాడిపోతుందని, ధ్యానానికి భంగం కలుగుతుందని భావించింది. నత్త శరీరం ఎప్పుడూ చల్లగా, తడిగా ఉంటుంది. వెంటనే అది నెమ్మదిగా పాకుతూ బుద్ధుని తలపైకి ఎక్కింది. తన శరీరంలోని తేమతో బుద్ధుడి తలకు చల్లదనాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. ఒక నత్తను చూసి వెనువెంటనే మరో 107 నత్తలు వరుసగా బుద్ధుని తలపైకి చేరాయి. మొత్తం 108 నత్తలు కలిసి బుద్ధుడి తలంతా ఒక టోపీలా పూర్తిగా కప్పేశాయి. సూర్యుడి తీవ్రమైన ఎండ నేరుగా బుద్ధుని తలపై పడకుండా ఆ నత్తలే భరించాయి.

అమరులైన మూగజీవులు

సాయంత్రం వరకు ఎండలో అలాగే ఉండిపోవడంతో నత్తల శరీరంలోని నీరంతా ఆవిరైపోయి తీవ్రమైన వేడికి ఆ 108 నత్తలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. సాయంత్రం బుద్ధుడు ధ్యానం ముగించి చూసేసరికి, తన కోసం ప్రాణాలు అర్పించిన నత్తలు తలపై నిర్జీవంగా పడి ఉన్నాయి. తన సాధన కోసం ప్రాణత్యాగం చేసిన ఆ చిన్న జీవుల కరుణకు బుద్ధుడు ఎంతగానో చలించిపోయాడు. వాటిని అమరులుగా భావించి గౌరవించాడు. ఆ నిస్వార్థ త్యాగానికి నివాళిగా, నాటి శిల్పులు బుద్ధుని విగ్రహాలు, చిత్రపటాలలో తలపై 108 నత్తలు ఉన్నట్లే చెక్కడం ప్రారంభించారని బౌద్ధ కథలు చెబుతాయి.

శిల్పకళ ప్రకారం ఉష్ణీష విశిష్టత

కళా చరిత్రకారుల ప్రకారం.. బుద్ధుని తలపై కనిపించే ఎత్తైన భాగాన్ని సంస్కృతంలో ఉష్ణీష అంటారు. ఇది పరిపూర్ణ జ్ఞానోదయం పొందిన మహాపురుషుడి మెదడు లేదా జ్ఞాన కిరీటానికి ప్రతీక. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో గాంధార, మథుర శిల్పులు బుద్ధుని తలపై కుడివైపునకు తిరిగిన చిన్న చిన్న రింగుల వంటి ఆకారాన్ని చెక్కడం మొదలుపెట్టారు. ఈ శిల్పకళా శైలి, నత్తల త్యాగ కథ.. రెండూ కలిసి ప్రజల్లో నత్తల విశ్వాసంగా స్థిరపడ్డాయి.

బోధి చెట్టుకు పూజలు ఎలా ప్రారంభమయ్యాయి?

బుద్ధుని జీవిత కాలంలోనే బోధి చెట్టును పూజించే ఆచారం మొదలైంది. శ్రావస్తిలోని జేతవనంలో బస చేసేందుకు బుద్ధుడు వస్తున్నాడని తెలిసి భక్తులు భారీగా పువ్వులు తీసుకొచ్చారు. అయితే బుద్ధుడు ధర్మ ప్రచారానికై మరో ప్రాంతానికి వెళ్లడంతో ఆయన రాలేదని భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ విషయాన్ని ప్రధాన శిష్యుడైన ఆనందుడు బుద్ధునికి వివరించగా.. ‘‘మనిషి శరీర భాగాలను పూజించాల్సిన అవసరం లేదు. నేను లేని సమయంలో జ్ఞానానికి ప్రతీక అయిన బోధి చెట్టును పూజించండి’’ అని బుద్ధుడు తెలిపాడు. దాంతో గయలోని అసలైన బోధి చెట్టు విత్తనాన్ని తెప్పించి జేతవనంలో నాటారు. ఆనాటి నుంచి బోధి వృక్షాన్ని పవిత్రంగా పూజించే సంప్రదాయం కొనసాగుతోంది. చిన్న నత్తలు చేసిన ప్రాణత్యాగాన్ని కూడా శతాబ్దాలుగా గుర్తుంచుకుని గౌరవించడం బౌద్ధ ధర్మంలోని జీవకారుణ్యానికి, కరుణా గుణానికి నిదర్శనం.

Follow Us