ప్రపంచాన్ని నడిపిస్తున్న మనోడు.. రెండు రూమ్‌ల ఇంటి నుంచి గూగుల్ బాస్ వరకు.. సుందర్ పిచాయ్ సక్సెస్ జర్నీ..
చెన్నైలోని ఓ రెండు గదుల చిన్న ఇల్లు.. విమానం ఎక్కేందుకు తండ్రి ఏడాది జీతాన్ని అప్పుగా తెచ్చిన నేపథ్యం.. కట్ చేస్తే.. నేడు ప్రపంచ టెక్ సామ్రాజ్యాన్ని శాసిస్తూ రూ.10,500 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. కేవలం ప్రతిభ, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ స్ఫూర్తిదాయక ప్రస్థానం ఇది.

ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ విజయ ప్రస్థానం కోట్లాది మంది యువతకు ఆదర్శం. ఒకప్పుడు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, నేడు దాదాపు రూ.10,500 కోట్లకు పైగా నికర ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బిలియనీర్ సీఈవోలలో ఒకరిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతం. పిచాయ్ సుందరరాజన్ 1972 జూన్ 10న తమిళనాడులోని మదురైలో జన్మించారు. ఆయన బాల్యమంతా చెన్నై అశోక్ నగర్‌లోని రెండు గదుల చిన్న ఇంట్లోనే గడిచింది. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా, తల్లి స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. చిన్ననాటి నుంచే మాథ్స్, సైన్స్ సబ్జెక్టులలో అద్భుతమైన ప్రతిభ చూపిన సుందర్.. సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక శైలిని కనబరిచేవారు. చెన్నై జవహర్ విద్యాలయ, ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లోని వనవాణి పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తిచేశారు.
ప్రతిష్టాత్మక విద్యాభ్యాసం.. తండ్రి త్యాగం
పాఠశాల విద్య అనంతరం ఖరగ్‌పూర్ ఐఐటీలో మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేసి సిల్వర్ మెడల్ సాధించారు. ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ సీటు సంపాదించారు. ఆ సమయంలో అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్ కోసం సుందర్ పిచాయ్ తండ్రి తన ఏడాది జీతానికంటే ఎక్కువ మొత్తాన్ని అప్పు చేసి సమకూర్చారు. అనంతరం ప్రఖ్యాత వార్టన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన సుందర్.. అక్కడ పామర్ స్కాలర్, సీబెల్ స్కాలర్ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.
గూగుల్ ప్రయాణం.. రికార్డు స్థాయి ఎదుగుదల
2004లో సాధారణ ఉద్యోగిగా గూగుల్‌లో అడుగుపెట్టిన సుందర్ పిచాయ్.. కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. ఇంటర్నెట్ ప్రపంచాన్ని సమూలంగా మార్చేసిన గూగుల్ క్రోమ్ బ్రౌజర్, గూగుల్ టూల్‌బార్ అభివృద్ధిలో ఆయన చూపిన సమర్థత మేనేజ్‌మెంట్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన అంకితభావం, దూరదృష్టిని గుర్తించిన సంస్థ.. 2015 ఆగస్టు 10న ఆయన్ను గూగుల్ సీఈవోగా నియమించింది. అనంతరం 2019 డిసెంబర్‌లో ఆల్ఫాబెట్ సంస్థ పగ్గాలను సైతం ఆయనకే అప్పగించింది. సంస్థను స్థాపించిన ఓనర్ కాకపోయినా.. కేవలం ప్రతిభ, అంకితభావంతో సంస్థను నడిపిస్తూ అపర కుబేరుడిగా ఎదిగిన సుందర్ పిచాయ్ ప్రస్థానం, పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని నిరూపిస్తోంది.
