Gold Price: బంగారం ధరలు భారీగా పడిపోతాయా? రూ.1.10 లక్షల దిగువకు వస్తాయా? BofA అంచనా ఇదే!
Gold Price Telugu: బంగారం ధరలు వరుసగా రెండో వారం తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో Bank of America కీలక అంచనాను వెల్లడించింది. బంగారం ధర ఔన్స్‌కు 4,000 డాలర్ల దిగువకు, మరింత ఒత్తిడి ఉంటే రూ.1.10 లక్షల కంటే దిగువకు చేరే అవకాశం ఉందని విశ్లేషించింది.

Indialo Bangaram Dharalu: బంగారం ధరలు వరుసగా రెండో వారం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) బంగారం ధరలపై కీలక అంచనాను వెల్లడించింది. ప్రస్తుత ఏడాది నాలుగో త్రైమాసికంలో బంగారం ధర ఔన్స్‌కు 4,000 డాలర్ల దిగువకు పడిపోయే అవకాశం ఉందని బ్యాంక్ అంచనా వేసింది. ధర సుమారు 3,750 డాలర్ల స్థాయికి చేరవచ్చని పేర్కొంది. భారత కరెన్సీలో ఇది సుమారు 10 గ్రాములకు రూ.1.15 లక్షలు అవుతుంది. అయితే భారత్‌లో బంగారం ధరలు డాలర్-రూపాయి మారకం రేటు, దేశీయ మార్కెట్ పరిస్థితులు, పన్నులు తదితర అంశాలపై ఆధారపడి మారుతాయి.
BofA వైఖరిలో ఎందుకు మార్పు?
గత రెండేళ్లుగా బంగారంపై సానుకూల అంచనాలు వ్యక్తం చేసిన సంస్థల్లో BofA కూడా ఒకటి. బంగారం ధర ఔన్స్‌కు 5,000 డాలర్లకు చేరవచ్చని తొలినాళ్లలోనే అంచనా వేసింది. అయితే ఇప్పుడు బ్యాంక్ తన అంచనాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచే అవకాశం ఉందని BofA ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామం బంగారం ధరలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషిస్తోంది.
రూ.1.10 లక్షల దిగువకు బంగారం వస్తుందా?
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలను మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగి, ముడిచమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరితే 2027లో బంగారం సగటు ధర ఔన్స్‌కు 3,500 డాలర్ల వద్ద ఉండొచ్చని BofA విశ్లేషకుడు పేర్కొన్నారు. ఇది భారత కరెన్సీలో సుమారు 10 గ్రాములకు రూ.1.08 లక్షలు అవుతుంది. అయితే ఈ స్థాయిని BofA తన ప్రధాన (బేస్-కేస్) అంచనాగా పేర్కొనలేదు.
జనవరిలో రూ.1.55 లక్షల అంచనా
జనవరిలో BofA బంగారం ఔన్స్ ధర 5,000 డాలర్లకు చేరాలంటే పెట్టుబడిదారుల డిమాండ్ సుమారు 14 శాతం పెరగాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉన్న పెట్టుబడి డిమాండ్ బంగారం ధరను సుమారు 4,000 డాలర్ల స్థాయిలో ఉంచేందుకు సరిపోతుందని బ్యాంక్ చెబుతోంది. 5,000 డాలర్ల స్థాయికి చేరుకోవాలంటే పెట్టుబడి డిమాండ్ మరింత గణనీయంగా పెరగాల్సి ఉంటుందని, ప్రస్తుత భౌగోళిక పరిస్థితుల్లో అది కష్టంగా ఉండొచ్చని BofA అభిప్రాయపడింది.
సెంట్రల్ బ్యాంకుల విక్రయాలు మరో రిస్క్
బంగారం ధరలకు మరో ప్రధాన ముప్పు కేంద్ర బ్యాంకుల నుంచి బంగారం విక్రయాలు పెరగడం కావచ్చని BofA పేర్కొంది. చమురు ధరలు పెరగడం వల్ల ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాల కరెన్సీలు, కరెంట్ అకౌంట్లపై ఒత్తిడి పెరగవచ్చని తెలిపింది. ఈ పరిస్థితుల్లో కొన్ని కేంద్ర బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలు, కరెన్సీలకు మద్దతు ఇచ్చేందుకు బంగారాన్ని విక్రయించే అవకాశం ఉందని విశ్లేషించింది. BofA ప్రకారం, రెండో త్రైమాసికంలో కేంద్ర బ్యాంకులు సుమారు 60 టన్నుల బంగారాన్ని విక్రయించాయి. ఈ విక్రయాల్లో టర్కీ ప్రధానంగా ఉంది. మార్చిలో కూడా కేంద్ర బ్యాంకులు నికర విక్రయదారులుగా ఉన్నాయని బ్యాంక్ తెలిపింది. ఈ విక్రయాలు మరింత పెరిగి, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా గోల్డ్ ETFల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటే, బంగారం ధరలపై మరింత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని BofA విశ్లేషించింది.
