కొన్నిసార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలను వెలుగులోకి తీసుకొస్తాయి. కొంతమంది అధికారులు లంచాలు తీసుకుంటుండగా తమ కెమెరాలో బంధించి నెట్టింట్లో పెడుతున్న ఘటనల గురించి తెలిసిందే. అప్పుడు లంచం తీసుకునే అధికారుల నిజరూపాన్ని బట్టబయలు చేస్తాయి. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో అలాంటి కేసు ఒకటి తెరపైకి వచ్చింది. ఇది పోలీసు డిపార్ట్‌మెంట్‌ను సిగ్గు పడేలా చేసింది. వాస్తవానికి.. పశ్చిమ బెంగాల్ నుండి బీహార్‌కు చేపలను తీసుకెళ్తున్న కార్గో టెంపో జనవరి 27 ఉదయం గిరిదిహ్ జిల్లాలోని డుమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుల్గో టోల్ నాకా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. రహదారి గుండా వెళుతుండగా చుట్టుపక్కల స్థానికులు రోడ్డుపై పడిన చేపలను తీసుకుని వెళ్ళడానికి ఎగబడ్డారు. సంచుల్లో చేపలను నింపుకున్నారు.
ఇంతలో చేపలతో కూడిన వాహనం బోల్తా పడింది అంటూ.. డుమ్రి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే స్థానికులు సుమారు 2 క్వింటాళ్ల చేపలను తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో 8 క్వింటాళ్లకు పైగా ఉన్న చేపల వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే పోలీసులు పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసిన కార్గో టెంపోలోని చేపలు కనిపించకుండా పోయాయి.
డ్రైవర్ ను లంచం కోరిన డుమ్రి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి
అంతేకాదు డుమ్రి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి .. టెంపోనివ్వాలంటే.. రూ. 10 వేలు ఇవ్వాలని డ్రైవర్ ను డిమాండ్ చేశాడు. డ్రైవర్ ఫోన్‌పే ద్వారా రూ. 6 వేలు బదిలీ చేశాడు.. మిగిలిన రూ. 4వేలను నగదు రూపంలో ఇచ్చాడు. అనంతరం ఆ డ్రైవర్ పోలీసు అధికారి లంచం డిమాండ్ చేసిన విషయాన్నీ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్తూ.. ఫోన్ పే ద్వారా డబ్బు బదిలీ చేసిన.. సాక్ష్యాన్ని ఎస్పీకి పంపాడు. అంతేకాదు డుమ్రీ పోలీస్ స్టేషన్‌లో పార్క్ చేసిన పికప్ వ్యాన్‌లో లోడ్ చేసిన చేపలను పోలీసు సిబ్బంది దోచుకున్న వీడియోను కూడా ఎస్పీకి అందించాడు. బాధితుడి వాహనం డ్రైవర్ పేరు జితేంద్ర యాదవ్. బీహార్‌లోని మోతిహరి జిల్లా నివాసి. ప్రస్తుతం జిల్లా ఎస్పీ ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. నెట్టింట్లో ఈ న్యూస్ వైరల్ అవుతుండడంతో.. ఇది పోలీసులకు సిగ్గు చేటు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..