AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆకాశంలో అద్భుతం.. చిమ్మ చీకట్లో రంగుల వెలుగులు.. వీడియో వైరల్..

జపాన్‌లో ఉల్కాపాతం కొద్దిసేపు కనువిందు చేసింది. ఉల్కలు భూమి వైపు దూసుకొచ్చి.. వివిధ రంగులతో ఆకాశాన్ని నింపాయి. ముఖ్యంగా బ్లూ, లైట్ గ్రీన్ రంగులతో కూడిన ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లాయి. ఉల్కలు కొన్ని సెకన్ల పాటు ఆకాశంలో మెరిసి, ఆ తర్వాత అదృశ్యమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఆకాశంలో అద్భుతం.. చిమ్మ చీకట్లో రంగుల వెలుగులు.. వీడియో వైరల్..
Fireball Meteor
Krishna S
|

Updated on: Aug 20, 2025 | 8:15 PM

Share

జపాన్‌లోని క్యుషు, షికోకు ప్రాంతాల్లో ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. పదుల సంఖ్యలో మండుతున్న ఉల్కలు భూమి వైపు దూసుకొచ్చి, వివిధ రంగుల మెరుపులతో ఆకాశంలో వెలుగులు నింపాయి. ముఖ్యంగా బ్లూ, లైట్ గ్రీన్ రంగులతో కూడిన ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లాయి. స్థానికులు తమ సెల్ ఫోన్లలో ఈ అరుదైన దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఫుకుయోకా, కగోషిమా, మాట్సుయామా విమానాశ్రయాల్లో అమర్చిన కెమెరాల్లో కూడా ఈ ఉల్కాపాతం రికార్డ్ అయింది. మండుతున్న ఉల్కలు కొన్ని సెకన్ల పాటు ఆకాశంలో మెరిసి, ఆ తర్వాత మాయమయ్యాయి.

ఉల్కలు ఎందుకు రంగులు వెదజల్లుతాయి?

ఉల్కలు భూమి లేదా ఇతర గ్రహాల వాతావరణంలోకి అధిక వేగంతో ప్రవేశించినప్పుడు వాటిలోని రసాయన పదార్థాలు కాలిపోయి వివిధ రంగుల కాంతిని వెదజల్లుతాయి. ఈ రంగులు ఉల్కల్లోని రసాయనాలు, భూ వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఈ భారీ ఉల్కలను ఫైర్‌బాల్స్ లేదా షూటింగ్ స్టార్స్ అని పిలుస్తారు.

జపాన్‌లో తరచుగా ఉల్కాపాతాలు

ఇటీవలే జపాన్‌లోని ఈశాన్య ప్రాంతంలోని అయోమోరి ప్రిఫెక్చర్‌లో ‘‘మీటెయోరాయిడ్ క్లస్టర్’’ కనిపించింది. ఇది పెర్సీడ్ మీటెయోర్ షవర్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఏర్పడింది. పెర్సీడ్స్ అత్యంత వేగవంతమైన ఉల్కపాతాలు. ఇవి స్విఫ్ట్-టటిల్ అనే తోకచుక్క నుండి వెలువడే శిధిలాలు భూ వాతావరణంలో మండినప్పుడు ఏర్పడతాయి.

భూమిపై ఉల్కల ప్రభావం

నాసా వివరాల ప్రకారం.. ప్రతిరోజూ సుమారు 44 టన్నుల ఉల్క పదార్థాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. అయితే వాటిలో 80 శాతం వరకు వాతావరణంలోనే ఆవిరైపోతాయి. కొన్ని మాత్రమే భూమిని లేదా సముద్రాలను తాకుతాయి. గతంలో దాదాపు అర టన్ను బరువు ఉన్న ఒక ఉల్క అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని మెక్‌అలెన్ ప్రాంతంలో భూమిని తాకింది. ఆ ఉల్క తాకిడికి భారీ గొయ్యి ఏర్పడటంతో పాటు స్వల్పంగా భూమి కంపించింది. ఈ సంఘటనలో సోనిక్ బూమ్ కూడా ఏర్పడింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us