
80 countries to visit COVID-19 vaccine: మరికొద్దిసేపట్లో 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈ బృందం హైదరాబాద్ లో కొన్ని కీలక పరిశోధన, అభివృద్ధి సంస్థలను బుధవారం సందర్శించనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ టీమ్ కోవిడ్ వ్యాక్సిన్ రూపకల్పనకు జరుగుతున్న కొన్ని కీలక పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై చర్చించనుంది.ముఖ్యంగా భారత్ బయోటెక్ కంపెనీ ప్లాంటును, బయోలాజికల్-ఈ ప్లాంట్లలను వీరు సందర్శిస్తారు. వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతులు కోరుతూ నాలుగు రోజుల వ్యవధిలో భారత్ బయోటెక్, ఫైజర్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు (డీసీజీఐ) దరఖాస్తులు సమర్పించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిధిలోని కొవిడ్-19 నిపుణుల కమిటీ ఈ మూడు విజ్ఞప్తులను నేడు పరిశీలిస్తుంది.
ఈ పర్యటనను పర్యవేక్షించే అడ్వాన్స్ టీమ్ ప్రతినిధులు విదేశీ బృందం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లపై సమీక్షించారు. అన్ని సదుపాయాలున్న 5 బస్సులు, ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక కరోనా వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతులు, నిల్వకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని హైదరాబాద్ ఎయిర్ కార్గో సిద్ధంగా ఉంది. హైదరాబాద్ కు వస్తున్న బృందం తిరిగి వెళ్లే ముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్న హైదరాబాద్ ఎయిర్ కార్గో కేంద్రాన్ని పరిశీలించే అవకాశం ఉంది. అటు ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనూ వ్యాక్సిన్ ఎగుమతి, దిగుమతులకు సంబంధించి ఏర్పాట్లు సాగుతున్నాయి.