
సాధారణంగా బడి పిల్లలకు ఉపాధ్యాయులంటే కాస్త భయం, క్రమశిక్షణతో కూడిన బెరుకు ఉంటాయి. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం బోధనతో పాటు తమ అపారమైన ప్రేమ, ఆప్యాయతలతో విద్యార్థుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. పిల్లలతో మంచిగా ఉంటూ, వారిలోని ప్రతిభను వెలికితీసే గురువులను పిల్లలు దేవుడిలా భావిస్తారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీ అయి వెళ్తుంటే ఆ వియోగాన్ని తట్టుకోలేక విద్యార్థులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల కళ్లను చెమర్చుతోంది. మహారాష్ట్రలోని ఓ గ్రామీణ పాఠశాలలో చోటుచేసుకున్న ఈ భావోద్వేగ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌ను కదిలిస్తుంది. ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడికి వేరే ప్రాంతానికి బదిలీ అయింది. అయితే స్కూల్ నుంచి బయటకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా బోరున విలపించారు. తమ అభిమాన గురువు ఇకపై తమకు పాఠాలు చెప్పరనే నిజాన్ని వారు అస్సలు జీర్ణించుకోలేకపోయారు.
పాఠశాల ఆవరణ నుంచి ఆ ఉపాధ్యాయుడు బయటకు నడుచుకుంటూ వెళ్తుండగా వందలాది మంది విద్యార్థులు ఆయన చుట్టూ చేరి గట్టిగా ఏడుస్తూ, కేకలు వేస్తూ బతిమాలసాగారు. సార్‌ను ఎలాగైనా ఆపాలని భావించిన కొందరు విద్యార్థులు పరుగుపరుగున వెళ్లి పాఠశాల ప్రధాన గేటును మూసేసి అడ్డంగా నిలబడ్డారు. తమను విడిచి వెళ్లొద్దంటూ గురువు కాళ్లను పట్టుకుని, ఆయనను హత్తుకుని కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థుల స్వచ్ఛమైన ప్రేమను, రోదనను చూసి అక్కడున్న ఉపాధ్యాయులు, గ్రామస్థులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. సదరు టీచర్ కూడా పిల్లలను ఓదార్చలేక, తన కన్నీళ్లను ఆపుకోలేక తీవ్ర ఆవేదన చెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“గురువు అంటే కేవలం సిలబస్ పూర్తి చేసే వ్యక్తి మాత్రమే కాదు.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ వారి హృదయాల్లో నిలిచిపోయే మార్గదర్శి” అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేటి యాంత్రిక సమాజంలో గురుశిష్యుల మధ్య ఇంతటి స్వచ్ఛమైన, పవిత్రమైన బంధం ఇంకా బతికే ఉందని చెప్పడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమని కామెంట్లు పెడుతున్నారు.