viral video: మాతృదేవోభవ..పితృదేవోభవ.. గురుదేవోభవ అన్నట్లు మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే. ఈ మాటలకు తగ్గట్లే గురుతర బాధ్యతతో పిల్లలకు మంచి నడవడిక నేర్పుతారు టీచర్లు. శిక్షణ, క్రమశిక్షణ అలవరిచి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా తోడ్పడుతారు. అందుకు తగ్గట్లే విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల పట్ల అంతులేని ప్రేమాభిమానాలు పెంచుకుంటారు. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ బడిపంతులు బదిలీపై వెళుతుంటే పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. వద్దు సార్.. వెళ్లొద్దు అంటూ ఏడ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
చందౌలి జిల్లాలో రాయ్‌ఘడ్ అని ఓ మారుమూల ప్రాంతం. కొండమీద ఉండడంతో అక్కడ అక్షరాస్యత కూడా చాలా తక్కువ. అయితే నాలుగేళ్ల క్రితం ఈ ప్రాంతానికి శివేంద్ర సింగ్ అనే ఓ ఉపాధ్యాయుడు వచ్చాడు. విద్యార్థులకు మంచి, చెడులు చెప్పి వారి మనసులు గెల్చుకున్నాడు. అతని పాఠాలంటేనే అక్కడి విద్యార్థులు అమితంగా ఇష్టపడేవారు. సోషల్ మీడియాలో పలు రకాల అంశాల గురించి నిత్యం విద్యార్థులతో షేర్ చేసుకునేవారు. అతని టీచింగ్ టెక్నిక్స్‌ను అక్కడివారిని కూడా ఆకట్టుకోవడంతో తమ పిల్లలను పనికి కాకుండా పాఠశాలకు పంపించారు. ఫలితంగా నాలుగేళ్లలో ఆ స్కూల్‌లో విద్యార్థుల హాజరు శాతం బాగా పెరిగిపోయింది.
#Chandauli: School students cried in farewell ceremony after #teacher‘s #uttarpradesh #transfer pic.twitter.com/s3UC00kfl3
— DHIRAJ DUBEY (@Ddhirajk) July 15, 2022
మళ్లీ వస్తాను..
అయితే ప్రభుత్వ టీచర్లన్నాక ట్రాన్స్‌ఫర్లు కూడా ఉంటాయి. శివేంద్ర సింగ్‌కు కూడా బదిలీ తప్పలేదు. నాలుగేళ్లుగా తమతో కలిసిపోయిన ఆటీచర్ వదిలివెళ్లిపోతుంటే విద్యార్థుల మనసు విలవిల్లాడిపోయింది. సరిగ్గా గురుపౌర్ణమి రోజున ఉపాధ్యాయునికి ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. అయితే ఆ పార్టీలో విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్ అంటూ ఉపాధ్యాయుడిని గట్టిగా పట్టుకుని వేడుకున్నారు. శివేంద్ర సింగ్ వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ అతనికి కూడా కన్నీరు ఆగలేదు. విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు సింగ్. విద్యార్థులను వదిలివెళ్లడం తనకు కూడా బాధగా ఉందని చెప్పారు. తాను మళ్లీ వస్తానని, అప్పటివరకు మీరు కష్టపడి చదవాలని కోరారు. ఉన్నత స్థానాల్లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కొలిగ్స్ కలిపి టీచర్‌కు బహుమతులను అందించి కన్నీటితో అతనికి వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..