Viral: పిచ్చి పలు రకములు.. కాస్త అటు ఇటైనా బాడీ గల్లంతే.. ఇదిగో వీడియో
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు ఏదైనా చేసేలా ఉన్నారు.. వైరల్ అయిపోయామా.. లైకులు తెచ్చుకున్నామా.. షేర్స్ కొట్టారా.. ఎంతసేపు ఇదే ధోరణి కనబడుతుంది.. సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవచ్చు అని ప్రాణాలకు సైతం తెగిస్తున్నారు. తాజాగా.. ఓ యువకుడు ట్రైన్ నుంచి చేసిన స్టంట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది..

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆశలో ఓ యువకుడు తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టి ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. నడుస్తున్న రైలులో ప్రమాదకరంగా బయటకు వేలాడుతూ చేసిన ఈ సాహసం వీడియోగా బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన ముంబైలోని డాక్‌యార్డ్ రోడ్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో జరిగినట్లు అధికారులు తెలిపారు. వీడియో వైరల్ కావడంతో వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఇలాంటి చర్యలను మొదట్లోనే అరికట్టకపోతే.. మిగతావాళ్ళు కూడా చూసి ప్రయత్నించే అవకాశం ఉంటుందంటూ విమర్శలు వచ్చాయి.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుండగా.. ఇదేం పైత్యం ఫేమస్ కావడానికి ఏదైనా చేస్తారా.. చర్యలు తీసుకోండి అంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు నడుస్తున్న లోకల్ ట్రైన్ నుంచి బయటకు ఊగుతూ సినిమా స్టైల్‌లో స్టంట్ చేస్తూ కనిపిస్తున్నాడు. రైలు ప్రవేశ ద్వారం దగ్గర అంచున నిలబడి.. తన శరీరాన్ని బంధించుకుని వేలాడుతూ హీరోలా పోజులు ఇస్తున్నాడు. ఇది ఎంత ప్రమాదకరమో వీడియో చూస్తే తెలుస్తుంది. చూడడానికి బాగానే ఉన్నా.. ఏ మాత్రం అదుపుతప్పినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఏ ఒక్కరు కూడా ఇలాంటి చర్యలను అనుమతించకూడదని స్థానికులు తెలిపారు. 2025, డిసెంబర్ 31న జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో RPF ఐటీ సెల్ సాంకేతిక విచారణ ప్రారంభించింది. వీడియో లొకేషన్, డిజిటల్ ఆధారాలు ఇతర సమాచారంతో నిందితుడిని గుర్తించారు. అనంతరం RPF బృందం మస్జిద్ బందర్ ప్రాంతంలో యువకుడిని అదుపులోకి తీసుకుంది.
వీడియో చూడండి..
పట్టుబడిన యువకుడు బీహార్‌కు చెందిన బాబుల్‌గా గుర్తించారు. విచారణలో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రమాదకర స్టంట్ చేసినట్లు అతడు అంగీకరించాడు. తన తప్పును ఒప్పుకున్న యువకుడు క్షమాపణలు చెప్పి, వీడియోను తొలగిస్తూ ఇకపై ఇలాంటి చర్యలు చేయనని హామీ ఇచ్చాడు.
RPF అధికారుల ప్రకారం.. యువకుడి నిర్లక్ష్యం వల్ల అతని ప్రాణాలకే కాదు, రైలులో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల భద్రతకూ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. రైల్వే చట్టం ప్రకారం చర్యలు తీసుకుని, కఠిన హెచ్చరికతో నోటీసుపై విడిచిపెట్టారు. కదులుతున్న రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణాల్లో స్టంట్లు చేయడం చట్టవిరుద్ధమని, ఇవి తీవ్రమైన ప్రమాదాలకు దారి తీస్తాయని RPF యువతకు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో చేసే ఇలాంటి ప్రమాదకర చర్యలపై ఇకపై మరింత కఠిన చర్యలు ఉంటాయని RPF స్పష్టం చేసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
