ఎండలు మండిపోతున్నాయ్.. పిల్లలు, పెద్దలు వేసవి తాపాన్ని తట్టుకోలేక సాయంత్రాల వేళల్లో పార్కులు, జలపాతాల వద్ద సేద తీరుతున్నారు. శీతల పానియాలు సేవిస్తూ దాహార్తిని తీర్చుకుంటున్నాడు. క్రమక్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మరి నోరులేని పక్షులు, జంతువుల పరిస్థితి మరెలా ఉంటుందో ఊహకైనా అందదు. అందుకే మన చుట్టూ ఉండే జంతువులు, పక్షుల దాహాన్ని తీర్చేందుకు చిన్న పాత్రల్లో ఆరుబయట నీళ్లు ఉంచితే పెద్ద పుణ్యం చేసినట్లే అవుతుంది. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ పిచ్చుక మండే ఎండలో వాహనాలు సంచరించే రోడ్డు మీద దాహంతో ఆయాస పడుతూ ఉండటం కనిపిస్తుంది. ఇంతలో ఓ వ్యక్తి బాటిల్ మూతలో నీళ్లు పోసి ఆ పిచ్చుక తాగేందుకు వీలుగా దాని ముందు ఉంచుతాడు. ఐతే పిచ్చుక తల వంచి ముక్కుతో నీటిని తాగే పరిస్థితిలో కూడా ఉండదు. దీంతో అతను మూతను వంపి పిచుక నోట్లో నీటి చుక్కలు వేస్తాడు. అది మెల్లగా ఆ నీటిని మింగడం వీడియోలో చూడవచ్చు.
‘దయతో చేసే చిన్న పనులు గొప్ప ఆలోచనల కంటే విలువైనవి. సైకిలిస్ట్ దాహంతో ఉన్న పక్షికి నీళ్లు అందించి దాని ప్రాణాలను కాపాడాడు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దయచేసి ఆరుబయట పక్షుల కోసం ఓ పాత్రలో నీళ్లు ఉంచండి’.. అనే క్యప్షన్‌తో ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద వీడియోను ట్వీట్ చేశాడు. లక్షల్లో వీక్షణలు, కామెంట్లు రావడంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయ్యింది. వేసవి కాలం దాదాపు వచ్చినట్లే. దయచేసి అందరూ పక్షుల కోసం కొంత నీళ్లు టెర్రస్‌పై ఉంచండి’, ‘దయాగుణం ఈ ప్రపంచాన్ని అందంగా మలుస్తుంది. మీరు కూడా ఇలా చేయండి’, ‘అతను చాలా మంచి పని చేశాడు… దేవుడి దీవెనలు అతనికి ఉంటాయి’.. అంటూ పలువురు నెటిజన్లు సుశాంత నంద చెప్పిన సందేశంతో ఏకీభవిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా మీ ఇంటి ఆరుబయట పక్షుల కోసం ఓ పాత్రలో నీళ్లు ఉంచుతారు కదూ..
“The smallest act of kindness is worth more than the greatest intention.”
A cyclist saw a thirsty sparrow & shares his drinking water with the bird.
Temperatures are rising. Please keep some water outside for the birds ? pic.twitter.com/bLQn7PHJta— Susanta Nanda (@susantananda3) March 2, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.