Viral News : బాస్ బోనస్.. రూ. 45 లక్షలు ఖరీదు చేసే బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్!
చైనాలో ఓ రెస్టారెంట్ యజమాని ఉద్యోగులపై చూపించిన ప్రేమ, అభిమానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చలిని సైతం లెక్కచేయకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లపై విధులకు వస్తున్న ఉద్యోగులను చూసి ఆమె చలించిపోయారు. వారి కష్టానికి గుర్తింపుగా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు. ఉద్యోగుల శ్రమతోనే సంస్థ అభివృద్ధి చెందిందని నమ్మిన ఆమె.. ఆ విజయ ఫలాలను తన సిబ్బందికి అందించారు.

చైనాలోని హెనాన్ ప్రావిన్స్ జియాజువోకు చెందిన మా యాన్లీ రెస్టారెంట్ చైన్‌ను నిర్వహిస్తున్నారు. తన సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ఆమె కొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు. సెప్టెంబర్ 24న కొంతమంది ఉద్యోగులను తీసుకుని షోరూమ్‌కు వెళ్లి వారికి కార్లను అందజేశారు. ఒక్కో కారు ధర భారత కరెన్సీలో రూ.43.5 లక్షలు. లక్కీ ఉద్యోగుల్లో ఒకరైన లీ జీకి తెలుపు రంగు బీఎండబ్ల్యూ కారు దక్కింది. ఆ కారు ఆమె పేరుపై అదే రోజు రిజిస్టర్ చేశారు. ఇందుకోసం ఆమె ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం రాలేదు. అంతేకాదు, కారు బహుమతిగా ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఎలాంటి ఒప్పందంపైనా సంతకం చేయాలని యజమాని కోరలేదు. కారు అందుకుంటున్న సమయంలో తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోయానని లీ జీ తెలిపారు. షోరూమ్‌కు వెళ్తున్నప్పుడు బాస్ తనకు ఓ పెద్ద బొమ్మను బహుమతిగా ఇస్తానని చెప్పారని, కానీ ఇంత ఖరీదైన కారు వస్తుందని అస్సలు ఊహించలేదని ఆనందపడ్డారు.
ఉద్యోగి పరిస్థితి చూసి చలించిపోయిన యజమాని
తన ఉద్యోగులకు కార్లు ఇవ్వాలనే ఆలోచన మా యాన్లీకి గత శీతాకాలంలో వచ్చింది. లీ జీ గత ఎనిమిదేళ్లుగా ఆమె రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. ఇతర ఉద్యోగుల మాదిరిగానే ఆమె కూడా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పనికి వచ్చేవారు. ఓ రోజు ఉదయం చలిలో స్కూటర్‌పై వచ్చిన లీ జీని మా యాన్లీ గమనించారు. చలిగాలులకు ఆమె ముఖం ఎర్రగా మారిపోయింది. చేతులు చలికి బిగుసుకుపోయాయి. ఆ దృశ్యం చూసిన మా యాన్లీ మనసు కలచివేసింది. తాను కారులో వెచ్చగా, సౌకర్యంగా ప్రయాణిస్తున్నప్పుడు.. తన దగ్గర పనిచేసే ఉద్యోగులు మాత్రం ఇంతటి చలిని ఎందుకు భరించాలని ఆమె ఆలోచించారు. అప్పుడే తన ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు.
సంస్థ విజయానికి ఉద్యోగులే కారణం
కేటరింగ్ రంగంలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న మా యాన్లీ.. తన వ్యాపార విజయం వెనుక ఉద్యోగుల కష్టం ఉందని చెబుతున్నారు. తాను వృత్తిపరంగా విజయం సాధించానంటే అది ఒక్కరి వల్ల సాధ్యమైన విషయం కాదని, తన ఉద్యోగులందరి సమష్టి కృషి వల్లే జరిగిందనీ అందుకే కంపెనీ విజయంలో ఉద్యోగులకు కూడా వాటా ఇవ్వాలని అనుకున్నారట. తన పనితీరు బాగుందని, కష్టపడి పనిచేస్తున్నానని చెప్పి బాస్ ఈ కారును బహుమతిగా ఇచ్చారని మరో ఉద్యోగి లియు యింగ్‌యింగ్ తెలిపారు.ఉద్యోగుల పట్ల మా యాన్లీకి ఇంతటి అభిమానం చూపించడం ఇదే తొలిసారి కాదు. చైనాలోని సంప్రదాయ పండుగల సమయంలోనూ ఆమె తన సిబ్బందికి నిత్యావసర వస్తువులతో పాటు క్యాష్ బోనస్‌లు అందిస్తుంటారు.
ఉద్యోగులకు భారీ బోనస్‌లు ఇచ్చే ఇంకొందరు
చైనాలో ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం, భారీ బోనస్‌లు ప్రకటించడం ద్వారా వార్తల్లో నిలిచే యజమానులు మరికొందరు కూడా ఉన్నారు. ఉద్యోగులకు డబ్బులు పంచడంలో హెనాన్ కువాంగ్‌షాన్ క్రేన్ కంపెనీ చైర్మన్ కుయ్ పెయ్‌జున్ కు మంచి పేరుంది.గత ఏడాది చైనీస్ నూతన సంవత్సర వేడుకలకు ముందు తన కంపెనీ ఉద్యోగులకు మొత్తం 18 కోట్ల యువాన్ల బోనస్‌లు అందించారు. ఇది అంతకుముందు ఏడాది కంపెనీ లాభాల్లో దాదాపు మూడింట రెండొంతుల మొత్తానికి సమానం. అమెరికన్ డాలర్లలో ఈ మొత్తం సుమారు 2.7 కోట్ల డాలర్లు. అంతేకాదు, ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సంస్థలో పనిచేసే 2,000 మంది మహిళా ఉద్యోగులకు ఒక్కొక్కరికి 800 యువాన్లు అందిస్తారు. అలాగే ప్రతి ఆగస్టులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు తమ పొలాల్లో పంట కోత కోసం యంత్రాలను అద్దెకు తీసుకునేందుకు ఒక్కొక్కరికి 1,000 యువాన్ల ఆర్థిక సాయం చేస్తారు.వ్యాపారంలో లాభాలు సంపాదించడమే కాకుండా.. ఆ విజయానికి కారణమైన ఉద్యోగుల జీవితాల్లోనూ మార్పు తీసుకురావాలని భావించే ఇలాంటి యజమానుల చర్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.