ద్రాక్షతోటలకు రక్షణగా ప్రకృతి సైనికులు.. కోట్ల పంటను కాపాడుతున్న గుడ్లగూబలు.. ఎలాగో తెలుసా?
రైతులకు ప్రకృతి ప్రసాదించిన ఓ ఆకాశ వేటగాడు ఆపద్బాంధవుడిగా మారాడు. కోట్లాది రూపాయల పంటను నాశనం చేస్తున్న ఎలుకల గుంపును తుడిచిపెట్టేందుకు ద్రాక్ష తోటల యజమానులు ఓ అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ద్రాక్ష తోటలను ఏటా పీడిస్తున్న ఎలుకల సమస్యకు విషపూరిత మందులు కాకుండా బర్న్ గుడ్లగూబల సహాయంతో అడ్డుకట్ట వేస్తున్నారు.

కాలిఫోర్నియా ద్రాక్ష తోటల యజమానులు తమ పంటలను రక్షించుకోవడానికి ఒక సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. సాధారణంగా పంటలు ఉన్నచోట ఎలుకలు, తొండలు, పందికొక్కులు వంటి రకరకాల పురుగులు, జీవుల బెడద ఎక్కువ. వీటికి తోడు కాలిఫోర్నియా వాతావరణం ఈ జీవులకు మరింత అనుకూలంగా ఉండటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లుతుంది. అయితే ఈ సమస్యను నివారించేందుకు అక్కడి వైన్ తయారీదారులు వినూత్నంగా ఆలోచించి గుడ్లగూబలను తమ తోటల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ చిన్న చిన్న ఎలుకల వల్ల కాలిఫోర్నియాలోని ద్రాక్ష తోటలకు ప్రతి ఏటా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలతో చేసే క్రిమినివారణ ప్రక్రియ చాలా ఖరీదైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఈ క్రమంలో నాపా వ్యాలీలోని ద్రాక్ష తోటల యజమానులు బర్న్ గుడ్లగూబల వైపు మొగ్గు చూపారు. ఈ గుడ్లగూబల ప్రధాన ఆహారం ఎలుకలే కావడం విశేషం.
సైంటిఫిక్ స్టడీలో సంచలన నిజాలు
కాలీ పోలీ హంబోల్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మ్యాట్ జాన్సన్, పరిశోధకురాలు క్యాథరిన్ లార్సన్, యూసీ డేవిస్ ప్రొఫెసర్ రోజర్ బాల్డ్విన్ కలిసి దీనిపై ప్రత్యేక పరిశోధన చేశారు. నాపా వ్యాలీలోని ద్రాక్ష తోటల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడ్లగూబల పెంపకానికి సంబంధించిన డేటాను వారు విశ్లేషించారు.
ఈ అధ్యయనంలో తేలిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
ఎలుకల సంఖ్య 52శాతం వరకు తగ్గిపోయింది: గుడ్లగూబల బాక్స్‌లు ఉన్న తోటల్లో ఎలుకల సంచారం గణనీయంగా పడిపోయింది.
ఒక గుడ్లగూబ కుటుంబం – వేలాది ఎలుకల వేట: ఒక బర్న్ గుడ్లగూబ కుటుంబం ఏడాదికి సుమారు 1,000 నుండి 4,000 ఎలుకలను వేటాడుతుంది.
భయంతో పారిపోతున్న ఎలుకలు: గుడ్లగూబలు కేవలం వేటాడటమే కాకుండా వాటి ఉనికితో 16శాతం నుండి 38శాతం వరకు ఎలుకలను భయపెట్టి తోటల వైపు రాకుండా చేస్తున్నాయి. ఒక రకంగా ఇవి సజీవ దిష్టిబొమ్మలుగా పనిచేస్తున్నాయి.
ద్రాక్ష తోటలే ప్రధాన వేటాడే కేంద్రాలు
ద్రాక్ష తీగలు గుడ్లగూబలకు రక్షణగా ఉంటూ ఎలుకలపై సైలెంట్‌గా దాడి చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఎలుకల చూపు కంటే గుడ్లగూబల వినికిడి శక్తి చాలా పదునుగా ఉండటంతో ఎలుకలు వాటికి సులభంగా చిక్కుతున్నాయి. గుడ్లగూబలు ఈ బాక్స్‌లలో చేరడానికి 1 నుండి 3 సంవత్సరాల సమయం పట్టినప్పటికీ, ఒకసారి స్థావరం ఏర్పరచుకున్నాక చాలా కాలం పాటు ఇవి పంటలకు ఉచితంగా రక్షణగా నిలుస్తాయి. కాలిఫోర్నియాలోని 500 కంటే ఎక్కువ గుడ్లగూబల పెటెల్లో దాదాపు 30శాతం నుండి 75శాతం వరకు గుడ్లగూబలు నివాసముంటున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా ద్రాక్ష తోటలను కాపాడుతున్న ఈ గుడ్లగూబలను ఇప్పుడు కాలిఫోర్నియా రైతులు రియల్ హీరోలు అని పిలుచుకుంటున్నారు.
