ప్రతి అమ్మాయికి పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. తన పెళ్లి రోజున కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు తనతో ఉండాలని కోరుకుంటుంది. మరి జీవితంలో ఎంతో కీలకమైన పెళ్లి రోజున తనను నడిపించిన నాన్న లేకపోతే ఆ బాధ వర్ణనతీతం. ఈనేపథ్యంలో ఓ అమ్మాయి పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో చెమ్మగిల్లిన కళ్లతో తండ్రి చిత్రపటం పట్టుకుని పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇస్తుంది నవ వధువు. ఈ సమయంలో ఆమె కళ్లన్నీ కన్నీటితో నిండిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో అందరి హృదయాలను కదిలిస్తోంది. నెటిజన్లు బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న వధువును ప్రియాంక భాటిగా గుర్తించారు. ప్రముఖ సోషల్ మీడియా బ్లాగ్ హ్యూమన్స్ ఆఫ్ బాంబే ద్వారా తన దీన గాథను పంచుకుంది. తన 9 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ తన తండ్రిని దూరం చేసిందని ప్రియాంక చెప్పింది.
ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ప్రియాంక, ‘నేను ఏది అడిగినా వెంటనే తీసుకొచ్చేవాడు నాన్న. నాకు మామిడిపండు అంటే ఇష్టమని ఎప్పుడూ ఓ మామిడి పండ్ల బాక్స్‌ను ఇంట్లోనే ఉంచేవారు. కానీ క్యాన్సర్ మా నాన్నను కబళించింది. దీని బారిన పడ్డాక ఆయన ఎక్కువ మంచానికే పరిమితమయ్యాడు. కానీ ఎప్పుడూ నా గురించే ఆరాటపడేవాడు. నాన్న మరణానంతరం మా తాత నన్ను పెంచాడు. ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. పిల్లలు నాతో ఆడుకోవడానికి భయపడేవారు. అయితే నాన్న చనిపోయిన తర్వాత ఆయన కూడా మారిపోయారు’ అని ఎమోషనలైంది. ఈ వీడియోలో, ప్రియాంక తన తాత చేయి పట్టుకుని పెళ్లిమండపానికి రావడం మనం చూడవచ్చు.
వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్ల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. కూతుళ్లందరికీ తండ్రే సూపర్ హీరో. అమ్మాయిల జీవితంలో తండ్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మీ నాన్న పైనుంచి మిమ్మల్ని చూస్తున్నారు. బాధపడకండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మీ తాత గారు’ అంటూ ఆ అమ్మాయిని ఓదారుస్తూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..