ఏటీఎం నుంచి 1300లు డ్రా చేస్తే.. అకౌంట్‌లో రూ. 294 కోట్లు.. రాత్రికి రాత్రే కుబేరుడైన ప్లంబర్..!
Bihar Plumber: రెక్కాడితే కానీ డొక్కాడని ఒక సామాన్య కూలీ ఖాతాలోకి రూ. 294 కోట్లు రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లక్ అంటే ఇదేనేమో అని కొందరు సరిపెట్టుకుంటున్నా, చట్టపరమైన ఇబ్బందులు వస్తాయనే భయంతో వికాష్ వ్యవహరించిన తీరును పలువురు అభినందిస్తున్నారు. ఈ నిధుల వెనుక ఉన్న అసలు రహస్యం బ్యాంక్ ఉన్నతాధికారుల పూర్తి స్థాయి విచారణలో తేలాల్సి ఉంది.

Bihar Plumber: ఖాతాలో వంద రూపాయలు ఉండటమే గగనమైన ఒక సామాన్య కార్మికుడి అకౌంట్‌లోకి అకస్మాత్తుగా వందల కోట్లు వచ్చి పడితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి వింతే బిహార్‌కు చెందిన ఒక ప్లంబర్ జీవితంలో జరిగింది. అతని బ్యాంక్ ఖాతాలో ఒక్కసారిగా వందల కోట్లు జమకావడంతో సదరు వ్యక్తితో పాటు స్థానిక పోలీసులు, బ్యాంక్ అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు.
ఊహించని అదృష్టం.. అకౌంట్‌లో రూ. 294 కోట్లు!
బీహార్‌లోని గయా జిల్లా మస్త్‌పురా గ్రామానికి చెందిన వికాష్ కుమార్ అనే యువకుడు ప్లంబింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజంతా కష్టపడితేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి అతనిది. బుధవారం ఒక కస్టమర్ పంపిన రూ. 1,300 నగదును విత్ డ్రా చేసుకున్న తర్వాత అతని ఖాతాలో కేవలం రూ. 113 మాత్రమే మిగిలాయి. అయితే, గురువారం ఉదయానికి అతని మొబైల్‌కు వచ్చిన ఒక మెసేజ్ వికాష్‌ను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉదయం చూసేసరికి అతని అకౌంట్ బ్యాలెన్స్ ఏకంగా రూ. 94 కోట్లకు చేరింది. ఆ వింత నుంచి తేరుకోకముందే, సాయంత్రానికి ఆ మొత్తం ఏకంగా రూ. 294 కోట్లకు పెరిగింది.
భయంతో వణికిపోయిన వికాష్.. పోలీసులకు ఫిర్యాదు..
సాధారణంగా అంత డబ్బు కనిపిస్తే ఎవరైనా ఆనందపడతారు. కానీ, వికాష్ కుమార్ మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఇంత భారీ మొత్తంలో డబ్బు తన అకౌంట్‌లోకి ఎలా వచ్చిందో తెలియక కంగారుపడ్డాడు. ఆ సొమ్మును ముట్టుకునేందుకు కూడా ధైర్యం చేయలేదు. వెంటనే ఈ విషయాన్ని గ్రామంలోని స్థానిక నాయకులకు వివరించాడు. వారి సూచన మేరకు ఆలస్యం చేయకుండా బోధ్‌గయ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీసి, తనకు ప్రాణసంకటంగా మారిన ఆ ‘కోట్ల’ వ్యవహారంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ ముమ్మరం..
ప్లంబర్ ఫిర్యాదుతో బోధ్‌గయ పోలీసులు తక్షణమే స్పందించారు. ఈ వింత కేసుపై పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మనోజ్ కుమార్ సింగ్ స్పందిస్తూ, ఇది అత్యంత సున్నితమైన ఆర్థిక విషయమని పేర్కొన్నారు. వికాష్ కుమార్‌కు సంబంధించిన బ్యాంక్ రికార్డులు, సర్వర్ లాగ్‌లు, లావాదేవీల ఐడీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ సొమ్ము ఏదైనా సాంకేతిక లోపం వల్ల లేదా బ్యాంకింగ్ పొరపాటు వల్ల జమైందా, లేక దీని వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
