
స్పెయిన్‌లోని ఒక పురాతన మైనింగ్ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో దాదాపు 2,000 సంవత్సరాల నాటి గడ్డితో చేసిన చెప్పులను కనుగొన్నారు. స్పెయిన్‌లోని సెవిల్లెకు పశ్చిమాన ఉన్న యురియం అనే ప్రాచీన మైనింగ్ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో ఇవి లభ్యమయ్యాయి. సాధారణంగా మొక్కలు, గడ్డితో తయారు చేసే వస్తువులు వందల ఏళ్లపాటు భూమిలో ఉంటే కుళ్ళిపోయి నాశనమవుతాయి. కానీ, ఇక్కడి ప్రాచీన లోహపు కొలిమిల పక్కనున్న బూడిద నిల్వలలో పడేయడం వల్ల, ఆ బూడిదలోని రసాయనాలు, పొడి వాతావరణం ఈ చెప్పులు పాడైపోకుండా కాపాడాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ పాదరక్షల అడుగు భాగాన్ని గట్టిగా ఉండే ఎస్పార్టో అనే ప్రత్యేకమైన గడ్డితో తయారు చేశారు. గడ్డిని నానబెట్టకుండా నేరుగా చుట్టి, సమతలంగా అల్లి అడుగు భాగం సిద్ధం చేశారు. ఎక్కువ బరువు పడే చోట మందపాటి గడ్డి తాడులను, కాళ్లకు పట్టుత్వం కోసం సన్నని దారపు పొరలను ఉపయోగించినట్లు గుర్తించారు.
ఈ గడ్డి చెప్పులను రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించగా, ఇవి క్రీస్తు పూర్వం 360 నుంచి క్రీస్తు శకం 124 మధ్య కాలానికి చెందినవని తేలింది. లభించిన అన్ని చెప్పులలో గోళ్లు, కాళ్ల రాపిడి వల్ల అరిగిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి. చాలా వాటికి కట్టుకునే పట్టీలు తెగిపోయి ఉన్నాయి. ఇవి విలాసవంతమైన కార్యక్రమాల్లో వాడేవి కావు అని, మైనింగ్ ప్రదేశంలో కష్టపడి పనిచేసే శ్రామికులు నిత్యం వాడి పడేసినవని స్పష్టమవుతోంది. ఈ రకమైన పరిశోధనలు వేల ఏళ్ల క్రితం జీవించిన సాధారణ మానవుల దైనందిన జీవితాన్ని కళ్లకట్టినట్లు చూపిస్తాయని పరిశోధకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..