Chanakya Niti: మౌర్యుల కాలంలో ఆచార్య చాణక్య గొప్ప పండితులు. అపర మేధావి. ఆర్థిక శాస్త్రంలో, పాలనా శాస్త్రంలో నిష్టాతులు. ఆయన వ్యూహాలకు తిరుగులేదు. ఆయన ధౌత్యానికి సాటి రాదు. అన్నింటికంటే మించి ఆచార్య చాణక్య మంచి గురువు. ఆయన చాలా సంవత్సరాల పాటు పిల్లలకు ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు. ఈ క్రమంలోనే ఆర్థికశాస్త్ర సహా, నైతిక విలువలు, తదితర అంశాలపై అనేక గ్రంథాలు రాశారు. అయితే, ఆచార్య చాణక్య తన ఎథిక్స్ గ్రంథంలో మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో కీలక విషయాలను ప్రస్తావించారు. కట్టు, బొట్టు, నడవడిక, ఆహారం, ఆహార్యం వంటి ప్రతీ అంశంలో మనిషి ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు.. అని కూలంకశంగా వివరించారు. అందుకే.. ఆయన చూపిన మార్గాలను తెలుసుకునేందుకు నేటికీ ప్రజలు ఆసక్తి కనబరుస్తుంటారు. నీతి శాస్త్రంలో ఆయన రాసిన అంశాలను అనుసరించడం ద్వారా ఎంతో మంది విజయతీరాలకు చేరారు కూడా.
ఇదిలాఉంటే.. మనిషి జీవితంలో ఆరోగ్యమే అతిప్రాధాన్య అంశం అని ఆచార్య చాణక్య అభిప్రాయం. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే.. అతను ఏ సమస్యతో అయినా పోరాడగలడు. అందుకే.. ముందుగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన చెబుతారు. మంచి ఆరోగ్యం.. మనం తీసుకునే ఆహారం మీదే ఆధార పడి ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం.. ఆరోగ్యంగా ఉండటానికి ఏం పాటించాలి.. ఏం పాటించకూడదతో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఆచార్య చాణక్య ప్రకారం.. మనం తాగే నీరు ఔషధం లాంటిది. ఆహారం తిన్న 1 నుంచి 2 గంటల తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. భోజనం చేస్తుండగా మధ్యలో కొద్దిగా నీరు త్రాగితే అది అమృతం లాంటిది. అయితే, భోజంన చేసిన వెంటనే నీళ్లు తాగడం మాత్రం విషం లాంటిదని పేర్కొన్నారు. భోజనం చేసిన వెంటనే ఎవరూ మంచినీరు తాగొద్దని ఆయన సూచించారు.
2. ముడి ధాన్యాల కంటే పొడి ధాన్యాలు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని ఆచార్య చాణక్య తెలిపారు. పొడి ధాన్యాల కంటే పాలు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. మాంసం.. పాల కంటే 10 రెట్లు ఎక్కువ పోషకాలు, కొవ్వు పదార్థాలను కలిగి ఉంటాయి.
3. ఆహారం కంటే గొప్ప ఆనందం మరొకటి లేదు. అయితే, మనం తీసుకునే ఆహారం మితంగా ఉండాలి. చేసే పనిని బట్టి మనం తీసుకునే ఆహారం ఉండాలంటారు చాణక్య.
4. అన్నికంటే ముఖ్యంగా.. మంచి ఆరోగ్యం కోసం, వ్యాధులకు దూరంగా ఉండాలంటే వారానికి ఒకసారి మసాజ్ చేయాలని చాణక్య తెలిపారు. కారణం.. ఇలా చేయడం ద్వారా.. శరీరంలోని వ్యర్థాలు అన్నీ చెమట రూపంలో బయటకు పంపబడుతుంది. అయితే, మసాజ్ చేయించుకున్న తరువాత తప్పనిసరిగా స్నానం చేయాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా శరీరం సంపూర్ణంగా శుభ్రపడుతుంది.
Also read:
Viral Video: పడుకున్న కుక్కను ఆట పట్టించిన పిల్లి.. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే నవ్వుకుంటారు..