గుజరాత్‌లోని కచ్ జిల్లా డోక్డా గ్రామ ప్రజలు పాలు అమ్మితే మహాపాపమని నమ్ముతారు. ఎందుకంటే.. పీర్ సైయద్నా అనే సూఫీ సాధువు ఒకరు 500 ఏళ్ల క్రితం డోక్డాకు వచ్చారట. ఆయన అక్కడి ప్రజలతో ఈ గ్రామం సుఖసంతోషాలతో వర్ధిల్లాలంటే ఇక్కడ ఎవ్వరూ కూడా పాలను అమ్ముకోవద్దని చెప్పారట. అప్పట్నుంచీ డోక్డా గ్రామ ప్రజలు పాలే కాదు, పెరుగు, నెయ్యి, ఇతర పాల పదార్ధాలను కూడా అమ్మడం మానేశారని ఆ గ్రామ ప్రజలు పేర్కొంటారు.. ఆ తర్వాత అది వారి ఆచారంగా మారుతూ వచ్చిందని.. పాలు అమ్మడం మహా పాపంగా భావిస్తామని పేర్కొంటున్నారు.
అయితే, ఇలాంటి ఆచారం కొనసాగిస్తున్న సమయంలో.. కొన్నాళ్లకు ఆ ఊరికి అల్లుడుగా వచ్చిన ఓ వ్యక్తి ఇదంతా నిజం కాదని వారి ఆచారాన్ని పక్కన పెట్టి పాల వ్యాపారం చేశాడని.. అతను వ్యాపారం మొదలు పెట్టిన కొన్ని నెలల్లోనే చనిపోయాడని గ్రామస్థులు పేర్కొంటున్నారు. దీంతో పాలను అమ్ముకోవద్దని సాధువు చెప్పిన మాటలపై డోక్డా ప్రజలకు నమ్మకం మరింత బలపడిందని.. అప్పటినుంచి పాలు అమ్మడం మహా పాపంగా భావిస్తూ ఉచితంగా ఇస్తామని పేర్కొంటున్నారు.
గ్రామంలో వ్యవసాయం చేసేవారంతా పశువులను పెంచుకుంటూ పాలను గ్రామంలో అవసరమై వారందరికీ ఉచితంగా ఇస్తారు. అంతేకాదు, చుట్టుపక్కల పల్లెల్లో పాడిలేని వారికి కూడా లీటర్ల కొద్దీ కల్తీలేని పాలు ఫ్రీగా అందిస్తుంటారని ఈ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..