ఇదో అరుదైన వివాహం.. మేము ఇద్దరం, మాకు తొమ్మిది మంది..! 11మందితో కొత్త కుటుంబం?

సామాజిక కట్టుబాట్లను, కుటుంబ నిబంధనలను పక్కనపెట్టి ఇద్దరు వ్యక్తులు తమ జీవితాల్లోని ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఒక్కటైన అరుదైన సంఘటన సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఒక మహిళ, ఆరుగురు పిల్లలకు తండ్రి అయిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుని కొత్త సంసారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఆసక్తికరమైన ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు విషయంలో ఏంటో తెలియాలంటే, పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఇదో అరుదైన వివాహం.. మేము ఇద్దరం, మాకు తొమ్మిది మంది..! 11మందితో కొత్త కుటుంబం?
11 Member Family

Updated on: Aug 21, 2026 | 3:32 PM

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లా భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణీ నాగల్ గ్రామంలో ఒక వినూత్న వివాహం చోటుచేసుకుంది. భోజ్‌పూర్ ప్రాంతానికి చెందిన రాణీ నాగల్ గ్రామంలో తబస్సుమ్ అనే మహిళ నివాసం ఉండేది. ఐదేళ్ల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త రియాజుల్ మరణించాడు. భర్త మరణానంతరం తన ముగ్గురు పిల్లలతో కలిసి అత్తవారి ఇంట్లోనే ఉంటూ వారి పోషణ బాధ్యతలను చూసుకుంటోంది. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం ఆమెకు కార్బాంక్యూ గ్రామానికి చెందిన మహమ్మద్ ఉమర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఉమర్ వృత్తిరీత్యా ఆటో మెకానిక్ కాగా, అతనికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఉమర్ మొదటి భార్య కూడా అతన్ని విడిచిపెట్టి మరో పెళ్లి చేసుకుంది. ఇలా ఇద్దరి జీవితాల్లోనూ ఒకే రకమైన ఒంటరితనం, ఇబ్బందులు ఉండటంతో ఒకరికొకరు దగ్గరయ్యారు. క్రమంగా వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

కుటుంబ సభ్యులు ఒప్పుకోరనే భయంతో తబస్సుమ్, ఉమర్‌లు మొదట కలీయర్ షరీఫ్‌కు వెళ్లి రహస్యంగా నికాహ్ చేసుకున్నారు. అనంతరం న్యాయపరంగా కోర్టు వివాహం కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయం తబస్సుమ్ అత్తవారింటి వారికి, గ్రామస్తులకు తెలియడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సమస్య పరిష్కారానికై గ్రామంలో పంచాయితీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పంచాయితీ పెద్దల ముందు తబస్సుమ్, ఉమర్‌లు ఇద్దరూ తాము మైనర్లు కామని, తమ స్వచ్ఛంద నిర్ణయంతోనే పెళ్లి చేసుకున్నామని, ఇకపై కలిసి జీవించాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. దీనికి తబస్సుమ్ అత్తింటి వారు మాట్లాడుతూ తమ కుటుంబం ఆమెను బాగానే చూసుకుందని, అయితే ఆమె ఇష్టపూర్వకంగా వెళ్లాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

ఉమర్ కూడా తబస్సుమ్‌తో పాటు ఆమె ముగ్గురు పిల్లల సంరక్షణ బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని పంచాయితీకి హామీ ఇచ్చాడు. స్థలం, ఇల్లు, పిల్లల పోషణకు సంబంధించిన అఫిడవిట్ సమర్పించిన తర్వాత పంచాయితీ పెద్దలు వీరి వివాహానికి సామాజిక ఆమోదం ముద్ర వేశారు. అనంతరం తబస్సుమ్ తన పిల్లలు, సామాగ్రితో కలిసి ఉమర్ ఇంటికి చేరుకుంది. భార్యాభర్తలిద్దరూ, వారి 9 మంది పిల్లలతో కలిపి మొత్తం 11 మంది సభ్యులతో ఒకే ఇంట్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us