
వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతమైన విజయంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో వెలుగు చూసింది. ఒక శిశువు రెండుసార్లు జన్మించింది. 20 వారాల గర్భవతిగా ఉన్న ఓ మహిళ గర్భంలోని శిశువు రెండుసార్లు జన్మించింది. ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన టీచర్ లూసీ ఐజాక్ తన అండాశయ క్యాన్సర్‌కు ఐదు గంటల ఆపరేషన్ చేయించుకుంది. ఆ సమయంలో సర్జన్లు ఆమె గర్భసంచిని తాత్కాలికంగా తొలగించారు. క్యాన్సర్ చికిత్స తర్వాత ఆమె గర్భాన్ని తిరిగి జాగ్రత్తగా ఆమె శరీరంలోకి చేర్చారు. ఇక, ఆమెకు సంపూర్ణంగా నెలలు నిండి ప్రసవ సమయం వచ్చిన తరువాత శిశువు పూర్తి ఆరోగ్యంగా జన్మించిందని వైద్యులు వెల్లడించారు.
ఇంతటి సంక్లిష్టమైన ప్రక్రియకు నాయకత్వం వహించిన సర్జన్ సోలేమాని మజ్ద్‌కు లూసీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. డాక్టర్ ఈ అనుభవాన్ని అరుదైన, భావోద్వేగంగా అభివర్ణించారు. లూసీ గర్భం దాల్చిన పన్నెండు వారాల తర్వాత ఆమెకు సాధారణ అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగు చూసింది. ఆమెకు అండాశయ క్యాన్సర్ ఉన్నట్టుగా నిర్ధారణ జరిగింది. ప్రసవం వరకు చికిత్సను ఆలస్యం చేయడం వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందని, లూసీ, ఆమె బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని వైద్యులు భావించారు. వెంటనే ఆమెకు సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం డాక్టర్ మజ్ద్, అతని టీమ్ సర్జరీ సమయంలో పుట్టబోయే బిడ్డను గర్భంలోనే ఉంచుతూ క్యాన్సర్ కణాలను తొలగించడానికి అరుదైన, సంక్లిష్టమైన విధానాన్ని ప్రతిపాదించారు. ఇప్పటివరకు కొన్ని సార్లు మాత్రమే నిర్వహించబడిన ఈ అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్‌లో, రాఫెర్టీ భద్రతను నిర్ధారించడానికి లూసీ గర్భాన్ని తాత్కాలికంగా తొలగించి, కీలకమైన రక్త నాళాలు, కణజాలాలకు అనుసంధానించి ఉంచడం జరిగింది. ఈ ప్రక్రియ సమయంలో 15 మంది వైద్య నిపుణుల బృందం డాక్టర్ మజ్ద్‌కు తోడుగా ఆపరేషన్‌లో పాల్గొన్నారు. గర్భం దాని అసలు స్థానానికి తిరిగి రావడానికి ముందు రెండు గంటల పాటు లూసీ శరీరం బయటే ఉంచారు. అత్యంత సంక్లిష్టమైన ఈ కేసును వైద్య బృందం ఎంతో అద్భుతంగా విజయవంతంగా పూర్తి చేసినట్టుగా వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..