AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఒకే ఇంట్లో 200 మంది.. భారత్‌లోని ఈ విచిత్ర కుటుంబం కథ తెలిస్తే అవాక్కే..

ఈ రోజుల్లో నలుగురు ఉన్న చిన్న కుటుంబంలోనే రోజువారీ ఖర్చులు, గొడవలతో సతమతమైపోతుంటారు. కానీ ఒకే ఇంట్లో ఏకంగా 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, మనవళ్లతో కలిపి దాదాపు 200 మంది ఎలాంటి గొడవలు లేకుండా ఒకే సైన్యంలా కలిసి జీవిస్తున్నారంటే నమ్ముతారా? వినడానికి ఏదో సినిమా కథలా ఉన్నా.. మన భారతదేశంలోనే కనిపించే నిజం ఇదీ

Video: 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఒకే ఇంట్లో 200 మంది.. భారత్‌లోని ఈ విచిత్ర కుటుంబం కథ తెలిస్తే అవాక్కే..
Incredible Story Of The World Largest Family
Krishna S
|

Updated on: Jun 07, 2026 | 10:35 AM

Share

నేటి ఆధునిక కాలంలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉంటేనే సంసారం సాగించడం కష్టంగా మారుతోంది. పండుగలకు నలుగురు బంధువులు వస్తేనే ఇల్లు నిండిపోతుంది. కానీ మన దేశంలోని ఒక చిన్న గ్రామంలో మాత్రం ఒక అసాధారణ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం అనే భావనకే కొత్త అర్థం చెప్పింది. ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా గుర్తింపు పొందిన ఈ మిజోరాం ఫ్యామిలీ కథ వింటే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. మిజోరంలోని బక్తావంగ్ గ్రామానికి చెందిన జియోనా చానా ఈ మహా సామ్రాజ్యానికి అధిపతి. జూన్ 2021లో తన 76వ ఏట కన్నుమూసిన జియోనా, తన 17వ ఏట మొదటి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఏకంగా 39 సార్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ దంపతులకు 94 మంది పిల్లలు, 14 మంది కోడళ్లు, 33 మందికి పైగా మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఆయన బతికున్న కాలంలో ఈ కుటుంబంలో ఏకంగా 160 నుండి 200 మందికి పైగా సభ్యులు ఒకే పచ్చని సంసారంగా కలిసి జీవించేవారు.

మిజోరాం కొండల్లో 100 గదుల ప్యాలెస్

ఈ భారీ కుటుంబం అంతా కలిసి మిజోరాం కొండల మధ్య ఉన్న ఒకే ఒక భారీ నివాసంలో ఉంటుంది. దీనికి చువాన్ థార్ రన్ అని పేరు పెట్టారు. నాలుగు అంతస్తులతో గులాబీ-ఊదా రంగులో మెరిసిపోయే ఈ మహా సౌధంలో సుమారు 100 గదులు ఉన్నాయి. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఒక చిన్న గ్రామం లాంటిది. ఇంత పెద్ద ఇల్లు సజావుగా సాగడానికి ఒక పక్కా మిలిటరీ క్రమశిక్షణ ఉంటుంది. జియోనా మొదటి భార్య ఇంటి పనులను పర్యవేక్షిస్తూ, మిగతా భార్యలు, కోడళ్లకు రోజువారీ బాధ్యతలను కేటాయించేవారు.

ఒక రోజు వంటకు వంద కిలోల బియ్యం..

ఈ ఇంట్లోని వంటగది పరిమాణం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఒక చిన్నపాటి క్యాటరింగ్ తరహాలో ఇక్కడ ప్రతిరోజూ భారీ కట్టెల పొయ్యిలపై పెద్ద పెద్ద అల్యూమినియం పాత్రల్లో వంట జరుగుతుంది. ఈ కుటుంబానికి రోజుకు దాదాపు 45 నుండి 90 కిలోల బియ్యం అవసరమవుతుంది. దీనితో పాటు 40 కిలోల బంగాళాదుంపలు, 25 కిలోల కూరగాయలు, 20 కిలోల పప్పుధాన్యాలు ఖర్చవుతాయి. ఒకవేళ ఆదివారం నాన్ వెజ్ వండాలనుకుంటే కనీసం 30 నుండి 35 కోళ్లు కావాల్సిందే. భార్యలంతా షిఫ్టుల వారీగా వంట చేస్తుంటే.. కూతుళ్లు, కోడళ్లు ఇల్లు శుభ్రం చేయడం, వడ్డించడం వంటి పనులు చూసుకుంటారు.

స్వయం సమృద్ధి.. ప్రపంచవ్యాప్త గుర్తింపు

జియోనా చానా కేవలం కుటుంబ పెద్ద మాత్రమే కాదు.. లాల్పా కోహ్రాన్ థార్ అనే క్రైస్తవ శాఖకు అధిపతి కూడా. ఆయన తన గ్రామంలో వ్యవసాయం, పశుపోషణ, వడ్రంగి పనుల ద్వారా సొంతంగా ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించి, కుటుంబాన్ని స్వయం సమృద్ధిగా నిలిపారు. తన పిల్లలు, మనవల కోసం సొంతంగా విద్యా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ అద్భుతమైన ఉమ్మడి జీవనం అంతర్జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. వీరి కథ ప్రముఖ రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ పుస్తకంలో కూడా చోటు సంపాదించుకుంది. 2021లో జియోనా చనిపోయినప్పటికీ, ఈ అద్భుత కుటుంబ గాథ ఇప్పటికీ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తూనే ఉంది.

Follow Us