
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో నివాసముండే సామల శ్రీశైలం(35) అనే యువకుడు ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం లోన్ యాప్‌లో 80 వేల రూపాయల డబ్బులు తీసుకున్నాడు. అవి కాస్తా వడ్డీతో కలిపి ఒక్క లక్షా 90 వేల రూపాయలు అయ్యాయి. వాటిని వెంటనే కట్టాలని రెండు రోజుల క్రితం లోన్ యాప్ సిబ్బంది ఇంటికి వచ్చారు. వచ్చి శ్రీశైలంను తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టారు.
రెండు రోజుల్లో డబ్బు కట్టకుంటే ఇంటి ముందు కూర్చుంటామని బెదిరింపులకు పాల్పడడంతో ఆందోళనకు గురైన శ్రీశైలం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గ్రామ శివారులో పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోగా అది గమనించిన బంధువులు శ్రీశైలంను ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీశైలం మృతి చెందాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్ సిబ్బంది వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని తండ్రి మల్లేశం తెలిపారు. లోన్ యాప్ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.