మనం రోజూ ఎన్నో ఘటనలు చూస్తూ ఉంటాం. కొన్నింటిని చూసి మనకు ఎందుకులే అని ఊరికే వెళ్లిపోతాం. కొన్నిసార్లు అయితే ఎవరైనా ప్రమాదంలో ఉన్నా చూసీ కూడా అయ్యో పాపం అనుకుంటామే తప్ప.. మనం ఎందుకు వాళ్లకు సాయం చేయకూడదనే ఆలోచన రావడం చాలా తక్కువ. అలా మన నుంచి సాయం పొందిన ఎవరైనా మనల్ని దేవుడిలా చూస్తారు. ఇక్కడ కూడా అలాంటి ఓ సంఘటనే జరిగింది. మూగజీవి ఆపదలో ఉందని గుర్తించిన ఓ యువకుడు ఎలాగైనా తన వంతు సాయానికి పూనుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఆ యువకుడు చేసిన పనికి మెచ్చుకుంటూ ప్రతిఒక్కరూ పొగుడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏదైనా సంఘటన జరిగితే దానిపై స్పందించే హృదయం ఉండడం చాలా గొప్ప గుణం. అలాంటి మనస్తత్వం అందరికీ ఉండదు. కానీ, ఇక్కడ ఓ యువకుడు స్పందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. హైదరాబాద్ నగరం పాతబస్తీలో పిల్లిని కాపాడడానికి ఓ యువకుడు చేసిన సాహసం అంతా కాదు. సుమారు 5 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఎట్టకేలకు ఆ పిల్లిని కాపాడాడు. అసలు ఆ సమయంలో అతను అక్కడ ఉండడం, ఆ సమస్యను గుర్తించడం, సాయానికి ముందుకు రావడమే అతి పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు.
మూసీ వంతెన మధ్యలో ఓ పిల్లి పైకి ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎటు పోవాలో తెలియక బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. చుట్టూ చూస్తే మొత్తం నీరు. ఆ మూగజీవికి ఏం చేయాలో తోచలేదు. మూసీ వంతెన ఒడ్డున భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ సమయంలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి తిరిగివెళ్లే సమయంలో మహ్మద్ మజార్ అనే యువకుడికి దిక్కు తెలియని స్థితిలో అటు ఇటు తిరుగుతూ ఓ పిల్లి కంటపడింది. ఎలాగైనా ఆ పిల్లిని కాపాడాలని నిర్ణయించుకున్నాడు మజార్. వెంటనే అందుకు తగిన ఆలోచన చేసి తన ఇంట్లో ఉన్న ఒక బోనును తీసుకొచ్చాడు. ఆ బోనులో పిల్లికి ఇష్టమైన ఆహారం పెట్టి ఓ తాడు సహాయంతో కిందికి దింపాడు. చాలాసేపు అక్కడే వేచి చూశాడు. మొత్తానికి సుమారు 5 గంటల పాటు పిల్లి అటు ఇటు పరుగులు పెడుతూ ఎట్టకేలకు ఆ బోనులోకి దూరింది. అనంతరం ఆ పిల్లిని తన ఇంటికి తీసుకెళ్లి ఫుడ్ పెట్టి తన ఇంటి బయట వదిలేశాడు. వెంటనే అది బోను నుంచి బయటికి వచ్చి పరుగులు పెడుతూ పారిపోయింది.
తన మంచి మనసుతో ఓ పిల్లి ప్రాణాలను కాపాడిన ఆ యువకుడిని అందరూ అభినందిస్తున్నారు. ఓ మూగజీవి పట్ల తాను చూపించిన జాలి, దయ పట్ల ఆ యువకుడిని గొప్పగా పొగుడుతున్నారు. ఒక మూగజీవి పట్ల ఇంత దయ చూపించి దాని ప్రాణాలను కాపాడిన ఈ యువకుడు చేసిన ఆలోచనకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..