Yadagirigutta: భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక యాదాద్రిలోనూ తిరుమల తరహా సేవలు

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందకంటే ఇకపై ఆధునిక టెక్నాలజీతో నృసింహుడి సన్నిధిలో పూర్తిసేవలు అందుబాటులోకి రానున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుమల తరహాలో 'డిజిటల్ యాదగిరి' ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు సేవలు అందించేందుకు యాదగిరిగుట్ట దేవస్థానం సన్నాహాలు చేస్తోంది.

Yadagirigutta: భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక యాదాద్రిలోనూ తిరుమల తరహా సేవలు
Yadadri Temple Goes Digital

Edited By:

Updated on: Mar 16, 2026 | 10:46 AM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల స్థాయిలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందుతోంది. కోట్లాది రూపాయలతో పునర్నిర్మించిన యాదాద్రి ఆలయం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దీంతో స్వామివారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. సాధారణ రోజుల్లో 50 వేల మంది భక్తులు వస్తుండగా, వీకెండ్, ఫెస్టివల్ రోజుల్లో లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో భక్తుల సందర్శన, నిర్వహణతోపాటు ఆలయ పరిపాలన పారదర్శకంగా ఉండేందుకు ఆధునిక సాంకేతికత వినియోగించుకోవాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం 20శాతం వరకు డిజిటలైజేషన్ జరిగినప్పటికీ, పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో తిరుమల తరహాలో పూర్తిస్థాయి ఆన్ లైన్ సేవలు అందించాలని ఆలయ అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.

తిరుమలలో ఆన్ లైన్ అప్లికేషన్ సేవలను అందిస్తున్న టీసీఎస్ ను దేవస్థానం సంప్రదించింది. తిరుమల తరహాలోనే కార్పొరేట్ సామాజిక బాధ్యతగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి డిజిటలైజేషన్ అప్లికేషన్స్‌ను అభివృద్ధిచేసి సాఫ్ట్వేర్ సేవలు అందించడానికి టిసిఎస్ అంగీకరించింది. దీంతో త్వరలోనే ‘డిజిటల్ యాదగిరి’గా భక్తులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం డీపీఆర్ రూపకల్పనకు సన్నాహాలు ప్రారంభం కాగా, ఆలయ పరిపాలన నుంచి వసతుల వరకు అన్ని సేవలు భక్తులకు ఆన్ లైన్ సేవలు లభించనున్నాయి.

యాదగిరిగుట్ట దేవస్థానం పరిపాలనను పర్యవేక్షించే 14రకాల విభాగాల కార్యకలాపాలు, టెండర్లు, కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులతోపాటు ఉద్యోగుల జీతభత్యాలవంటి పూర్తి సేవలను కాగితరహితంగా డిజిటలైజేషన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. స్వామివారి దర్శనాల్లో బ్రేక్ దర్శనాలు, అతి శీఘ్ర దర్శనాలు, ప్రత్యేకదర్శనాలు, ఆలయంలో భక్తులు జరిపించుకునే అన్ని రకాల ఆర్జిత సేవలను ఆన్ లైన్ ద్వారా భక్తులు పొందనున్నారు. తిరుమల తరహాలో ధర్మదర్శనాలకు కూడా భవిష్యత్లో స్లాట్ విధానం అమల్లోకి వస్తే వినియోగించడానికి అప్లికేషన్ మాత్రం సిద్ధం చేయనున్నారు.

స్వామి వారి ప్రసాదాలను, శాశ్వత పూజలతోపాటు ఈ – హుండీలను కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ – హుండీల ద్వారా దేశ విదేశాల భక్తులు కానుకలను సమర్పించే అవకాశం, ఈ-డోనర్స్ విధానం ద్వారా దాతలకు ప్రాముఖ్యం పెంచి,సత్వర సేవలు అందిస్తారు. కొండపైకి వచ్చే అన్నిరకాలవాహనాలకు ఫాస్టాగ్ మాదిరిగా డిజిటల్ ప్రవేశం కల్పిస్తారు. డిజిటల్ యాదగిరి ఆన్ లైన్ సేవల వసతి సదుపాయాల సమాచారం సత్వరంగా అందే అవకాశం ఉంటుంది. ఈ-సేవలు రానున్న ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనీ ఆలయ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us