అమ్మ మాటే లక్ష్యంగా.. యువకుడి అరుదైన కృషి.. ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులను సొంతం…

| Edited By: Ram Naramaneni

Sep 12, 2024 | 1:24 PM

ఒకరోజు సరదాగా వీధిలో చిన్నపిల్లల ముందు.. మ్యాజిక్ ప్రదర్శన ఇస్తుంటే.. తల్లి మల్లమ్మ చూసి ఇలా చిన్న ప్రదర్శనలు కావు.. ప్రపంచం గుర్తించేలా చేయ్‌ అన్న మాటలు క్రాంతిలో పట్టుదలను పెంచాయి. ఏం చేస్తే ప్రపంచ గుర్తింపు పొందవచ్చో మూడేళ్లు కృషి చేసి, పదేళ్లు సాధన చేశాడు.

అమ్మ మాటే లక్ష్యంగా.. యువకుడి అరుదైన కృషి.. ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులను సొంతం...
Paniker Kranti
Follow us on

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు మన పెద్దలు. ఎనలేని పట్టుదల, మడమతిప్పని సాధన.. వెరసి ఒకేసారి నాలుగు గిన్నీస్‌ రికార్డులను సొంతం చేసుకుని ప్రపంచ గుర్తింపు పొందాడు ఓ యువకుడు. ప్రపంచం నిన్ను గుర్తించేలా చేయ్‌.. అన్న అమ్మ మాటను నిజం చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరుకు చెందిన సత్తెయ్య, మల్లమ్మలకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ కూలీనాలీతో జీవనం గడుపుతున్నారు. వీరి కొడుకు క్రాంతి.. చదువుల్లో చురుకుగా వుంటూనే మ్యాజిక్‌ నేర్చుకున్నాడు. పేదరికం అడ్డొచ్చినా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చదువుకుంటూనే సాహస విన్యాసాలు సాధన చేయడం ఆరంభించాడు.

ఒకరోజు సరదాగా వీధిలో చిన్నపిల్లల ముందు.. మ్యాజిక్ ప్రదర్శన ఇస్తుంటే.. తల్లి మల్లమ్మ చూసి ఇలా చిన్న ప్రదర్శనలు కావు.. ప్రపంచం గుర్తించేలా చేయ్‌ అన్న మాటలు క్రాంతిలో పట్టుదలను పెంచాయి. ఏం చేస్తే ప్రపంచ గుర్తింపు పొందవచ్చో మూడేళ్లు కృషి చేసి, పదేళ్లు సాధన చేశాడు. ఇప్పటి వరకు 300లకు పైగా జాతీయ, అంతర్జాతీయ టీవీ ఛానెళ్లలో ప్రదర్శనలిచ్చాడు. ఈ మ్యాజిక్ షోలను చూసి గిన్నిస్ బుక్‌రికార్డు వారు క్రాంతికి ఆహ్వానం పంపారు. ఒకేసారి పది గిన్నిస్ బుక్‌ రికార్డుల కోసం ప్రయత్నించి.. నాలుగు గిన్నిస్ బుక్‌ రికార్డులను కైవసం చేసుకున్నాడు.

క్రాంతి రికార్డులు సాధించింది ఈ విభాగాల్లోనే..

1)60 సెకన్లలో 72 టేబుల్‌ ఫ్యాన్లతో నాలుకతో ఆపగా అందులో 57 ఫ్యాన్లు ఆగినట్లు రికార్డు నమోదైంది.

2)గొంతులో రెండు అడుగుల పొడవైన 37 కత్తులు దింపుకుని 16 సెకన్లలో 1,944 కిలోల బరువు (కారు, దానిపై ఎనిమిది మంది)ని లాగాడు.

3)ముక్కు లోపలికి నాలుగు ఇంచుల పొడవాటి ఇనుప మేకులను సుత్తితో కొట్టి లోపలికి దించడం.

4)60 సెకన్లలో 22 మేకులను ముక్కులో దించుకుని రక్తపు చుక్క రాకుండా కొత్త రికార్డు నమోదు చేశాడు. 60 సెకన్లలో మరుగుతున్న నూనె నుంచి 17 చికెన్‌ ముక్కలను బయటకు తీశాడు.

అమ్మ ఆశయాన్ని నిజం చేశా…

చిన్నప్పుడు అమ్మ అన్న మాటలను పట్టుదలగా కృషి చేసి.. ప్రపంచ గుర్తింపు పొందడంతో అమ్మ కలను సాకారం చేశానని క్రాంతి చెబుతున్నాడు. మరో మూడింటి కోసం సాధన చేస్తున్నా. అతి త్వరలోనే మరికొన్ని రికార్డులను అందుకుంటానని క్రాంతి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఆల్ ది బెస్ట్.. క్రాంతి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..