వైఎస్ షర్మిల – కాంగ్రెస్ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆంధ్రా – తెలంగాణ ఎక్కడ అన్నది కాంగ్రెస్ పార్టీ తేల్చలేకపోతోంది. తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని వైఎస్ షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలకు చెప్పారు. జాతీయ నాయకత్వానికి తన అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పి తెలంగాణలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అయితే షర్మిల చేరికపై తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాకు చెందిన వారికి తెలంగాణలో చోటు లేదంటోంది రేవంత్ రెడ్డి వర్గం. గతంలో స్వయంగా రేవంత్ రెడ్డి కూడా షర్మిల చేరిక విషయం ఏపీ పార్టీ చూసుకుంటుందని తెలంగాణకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. అయితే షర్మిల చేరిక పట్ల సానుకూలంగా ఉన్న భట్టి సహా ఇతర నేతలు మాత్రం అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దుమారం కొనసాగుతుండగానే.. ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల వస్తారంటూ నేతలు లీకులిస్తున్నారు.
షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు సమాచారం ఉందన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ వాదిగా, వైఎస్ బిడ్డగా ఆమెను స్వాగతిస్తామంటున్నారు. రాహుల్‌తో భేటీ తర్వాత కేవీపీ కామెంట్స్ ఈ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. షర్మిల విషయంలో రాహుల్‌గాంధీ సూచనలు అమలు చేస్తామన్న కేవీప.. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందంటూ అభిప్రాయపడ్డారు.
రాహుల్ పర్యటన నేపథ్యంలో మరోసారి వైఎస్‌ఆర్‌టీపీ విలీనం చర్చనీయాంశం అయింది. ఇప్పటికే ప్రాధమికంగా చర్చలు జరగ్గా.. తాజాగా రాహుల్ టూర్ సందర్భంగా కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. షర్మిల చేరికను స్వాగతిస్తున్న నేతలు రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె జానారెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తోంది. తనకు తెలంగాణలోనే అవకాశం ఇవ్వాలని ఆమె రాయబారాలు నడుపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం