ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సి(బి ), కోసాయి గ్రామాల్లో బెల్ట్ షాపులు, కల్లు బట్టీలపై మహిళల దాడులు చేశారు. గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కల్లు బట్టీలు, బెల్టు దుకాణాలపై విరుచుకు పడ్డారు. దొరికిన మద్యాన్ని దొరికనట్టు నేలపాలు చేసి ఉగ్రరూపం చూపించారు. అసలే కరువు కాలంతో పనులు లేక, తాగేందుకు నీళ్లు లేక జనం అవస్థలు పడుతున్నారు. అలాగే మరోవైపు పంటలు ఎండిపోతుంటే.. చేతిలో చిల్లిగవ్వ లేక పూడగడవని కష్టకాలం ఏర్పాడింది. ఇలాంటి సమయంలో గ్రామ యువకులను, పురుషులను మద్యానికి బానిసలుగా చేస్తున్నారంటూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు మహిళలు. ఇలా చేయడం వల్ల తమ కుటుంబాలు మరింత అప్పుల ఊబిలో మునిగిపోయేలా బెల్ట్ షాపులు చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ మద్యం దుకాణాలపై మూకుమ్మడి దాడులకు దిగారు మహిళలు. మద్యానికి బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న తమ గ్రామ యువతను కాపాడుకోవాలంటే అక్రమ మద్యం దుకాణాలపై దాడులకు దిగక తప్పదని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే గ్రామ మహిళలు ఈ చర్యలకు పాల్పడ్డారు. దాడులు చేసినా కూడా లెక్క చేయకుండా వ్యాపారాన్ని మళ్లీ యదావిధిగా కొనసాగిస్తామంటే ఈసారి బెల్ట్ షాపులు మాత్రమే కాదు వ్యాపారుల ఇళ్లపై సైతం దాడులు చేస్తామంటూ మహిళలు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కల్లు బట్టీల నిర్వహకులపై తీవ్ర ఆవేశంతో విరుచుకుపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..