హైదరాబాద్(Hyderabad) అంటేనే ఉరుకులపరుగుల జీవనం. క్షణం ఖాళీ లేకుండా ప్రతి ఒక్కరూ బిజీబిజీగా తమతమ పనుల్లో నిమగ్నమైపోతుంటారు. ఇలాంటి నగరంలో నివాసముండేందుకు అద్దె గదులు దొరకడం గగనమే. అందుకే వారి అవసరాలు తీర్చేందుకు హాస్టళ్లు (Hostels) ఏర్పాటయ్యాయి. ఆశ్రయం పొందుతున్న వారి నుంచి డబ్బు తీసుకుని వసతి సౌకర్యం అందిస్తాయి. ఇలా డబ్బులు చెల్లించి ఉండేందుకూ పలువురు తీవ్ర ఇబ్బందులు పడతారు. అలాంటి పరిస్థితే ఈ మహిళకూ వచ్చింది. హాస్టల్ లో డబ్బులు కట్టకపోవడంతో నిర్దాక్షీణ్యంగా రోడ్డుపై వదిలేశారు. దిక్కు తోచని స్థితిలో ఆ మహిళ కారు లోనే నివాసముంటోంది. ఇలా ఒక రోజో, వారం రోజులో కాదు. ఏకంగా రెండేళ్లుగా కారులోనే నివాసముంటోంది. హైదరాబద్ నగరంలోని ఎస్సార్ నగర్(SR.Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ మెయిన్‌రోడ్డులో ఓ మహిళ రెండేళ్లుగా కారులో నివాసముంటోంది. మారుతీ ఓమ్ని కారులో మహిళ నివాసముంటున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో పోలీసులు సదరు మహిళ వద్దకు చేరుకుని ఆమెతో మాట్లాడారు. తన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా.. పేరు గుర్రం అనిత అని తెలిసినట్లు పోలీసులు తెలిపారు.
అనిత స్థానికంగా ఉన్న ఓ హాస్టల్‌లో ఉండేది. ఫీజు చెల్లించకపోవడంతో రెండేళ్ల క్రితం హాస్టల్ నిర్వాహకులు ఖాళీ చేయించారు. దీంతో తన సామగ్రి తీసుకుని అప్పటి నుంచి కారులోనే ఉంటోంది. కారునే ఇంటిలా మార్చుకుని ఉంటున్న అనితకు స్థానికులు ఆహారం అందజేస్తున్నారు. అందులోనే నిద్రపోతూ, రోజంతా అందులోనే కూర్చుంటోంది. కారును రోడ్డుపై నిలిపి ఉంచినందుకు రెండేళ్లుగా ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు కూడా విధించారు. మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు ఇలా కారులో ఉండటం శ్రేయస్కరం కాదని, స్టేట్‌హోం తరలించి ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు. అందుకు అనిత అంగీకరించకపోవడం గమనార్హం.
Also Read
Viral Video: పామునే పడవగా మార్చుకున్న కప్ప, ఎలుకలు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Upasana: అరుదైన గౌరవాన్ని అందుకున్న ఉపాసన.. నాట్ హెల్త్ సీఎస్‌ఆర్ అవార్డుకు ఎంపిక..