తెలంగాణ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీ-ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. అనంతరం మాట్లాడిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా టీ-ఫైబర్ పనులు వేగంగా సాగుతున్నాయని, ఇంటింటికీ ఇంటెర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత ఉండకూడదన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని తెచ్చారని అన్నారు. చెట్లను ఇష్టారీతిన నరికితే భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలిని కొనుక్కోవల్సి వస్తుందన్నారు.
వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని.. ఇందుకోసం 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటును అందిస్తున్నామని చెప్పారు కేటీఆర్. అలాగే కరోనా వంటి కష్ట కాలంలోనూ రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం.. రూ.7,200 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, పూర్తిగా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్.