Pawan Kalyan: పవన్‌ చేసిన వ్యాఖ్యల్లో రాజకీయ ఎత్తుగడ ఉందా.? అసలు వ్యూహం ఇదేనా.?

తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవన్ని దెబ్బతీశారన్న పవన్‌ వ్యాఖ్యల వెనక రాజకీయ ఎత్తుగడ ఉందా? భవిష్యత్తు పొత్తులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా స్పందించారా? ఏపీ కంటే ముందే వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారా?

Pawan Kalyan: పవన్‌ చేసిన వ్యాఖ్యల్లో రాజకీయ ఎత్తుగడ ఉందా.? అసలు వ్యూహం ఇదేనా.?
Pawan Kalyan

Updated on: Apr 17, 2023 | 8:00 PM

తెలంగాణ మంత్రి హరీశ్ రావు వర్సెస్ ఏపీ మంత్రుల మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. ఈ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ స్పందించడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటి పోతున్నాయన్న పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ ప్రజల్ని నిందించిన ఏపీ మంత్రులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏపీని ఉద్దేశించి ఎవరేమన్నా వదిలేయాలా… అయినా పవన్‌ కల్యాణ్‌కు బీఆర్‌ఎస్‌పై కొత్తగా ఈ ప్రేమ ఎందుకు పుట్టిందో అంటూ వైసీపీ నాయకులు సరికొత్త డౌట్‌ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటానని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు.

ఇరు రాష్ట్రాల మంత్రులు మధ్య మాటల మంటలు కొనసాగుతుండగానే సీనులోకి ఎంట్రీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలతో సరికొత్త మలుపు తిరిగింది. తెలంగాణ ప్రజలు, ప్రాంతం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మంత్రులు స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్న పవన్ కళ్యాణ్.. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. నేతలు వేరు ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న పవన్‌.. మంత్రులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణను, అక్కడి ప్రజలను ఏపీ మంత్రులు ఎవరూ ఏమీ అనలేదంటున్న వైసీపీ.. ప్యాకేజీ కోసం పవన్‌ బురద జల్లుతున్నారంటోంది. ఏపీ మంత్రులనుద్దేశించిన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వెంటనే పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాలంటున్నారు వైసీపీ నేతలు. గతంలో చంద్రబాబు, లోకేష్‌లను విమర్శిస్తే బయటకొచ్చిన పవన్‌ కల్యాణ్‌కు.. బీఆర్ఎస్‌ పట్ల కొత్తగా ఈ ప్రేమ ఏంటో అర్థం కావడం లేదన్నారు పేర్ని నాని.

జనసేన-వైసీపీ మధ్య మాటలతూటాలు పేలుతుండగానే మళ్లీ తెలంగాణ మంత్రి హరీష్‌రావు మరోసారి స్పందించారు. ఏపీ ప్రజలను ఏమీ అనలేదని.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మాత్రమే ప్రస్తావించినట్టు స్పష్టత ఇచ్చారు. ఏమీ అనకపోయినా కొంత మంది నాయకులు ఎగేరిగిరి పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చేతనైతే ఏపీకి హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని సూచించారు. తెలుగురాష్ట్రాల మధ్య రాజుకున్న అగ్గి క్రమంగా అన్ని పార్టీలకు సెగ తాకుతోంది. మరి ఇంకా ఎలాంటి మలుపుతు తిరుగుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..