Telangana: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య జలజగడం

|

Feb 11, 2024 | 7:02 PM

తెలంగాణలో అధికార, ప్రతిపక్షం మధ్య మరోసారి నీటి యుద్ధం జరగబోతోందా ? కృష్ణా జలాలపై కాంగ్రెస్‌ను కార్నర్ చేసేందుకు బీఆర్‌ఎస్ రెడీ అవుతుంటే.. ఇరిగేషన్‌పై శ్వేతపత్రం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మేడిగడ్డ సందర్శనతో గులాబీ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది అధికార కాంగ్రెస్. దీంతో రెండు పార్టీల మధ్య అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది.

Telangana: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య జలజగడం
Weekend Hour
Follow us on

తెలంగాణలో అధికార, ప్రతిపక్షం మధ్య జలజగడం మరింత ముదురుతోంది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించి.. మన జుట్టు కేంద్రం చేతికి ఇచ్చారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో అధికార పార్టీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఎల్లుండి నల్లగొండలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలను ఎండగట్టాలని భావిస్తోంది. ఈ సభకు కేసీఆర్‌ హాజరవుతుండటం.. ఎన్నికల తరువాత ఆయన మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కానుండటంతో.. బీఆర్‌ఎస్ సభపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

అయితే బీఆర్‌ఎస్ వ్యూహానికి చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ మేడిగడ్డ టూర్‌ను తెరపైకి తీసుకొచ్చింది. బీఆర్‌ఎస్ సభ పెట్టిన రోజే తెలంగాణ ఎమ్మెల్యేలందరినీ మేడిగడ్డకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కేసీఆర్‌ కూడా మేడిగడ్డ సందర్శనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ 13న బీఆర్‌ఎస్‌కు వేరే కార్యక్రమాలు ఉంటే.. తేదీ మార్చుతామని తెలిపారు.

మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు రావాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పలికిన ఆహ్వానంపై కేటీఆర్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కట్టిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. ఆ ప్రాజెక్ట్‌ గురించి కాంగ్రెస్ పార్టీకి ఏమీ తెలియదని చెప్పారు. ప్రాజెక్ట్ కట్టింది తామే కాబట్టి.. చూడాల్సింది కాంగ్రెస్ వాళ్లని చెప్పారు. మేడిగడ్డను తాము గతంలోనే సందర్శించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

మరోవైపు అసెంబ్లీలో ఇరిగేషన్‌ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. దీనిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశయ్యారు. కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ అవినీతిని, ఆయన వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని వివరిస్తామని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

మొత్తానికి బీఆర్‌ఎస్ వ్యూహానికి కాంగ్రెస్ ప్రతివ్యూహాన్ని సిద్ధం చేయడంతో.. రెండు పార్టీల మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…