తెలంగాణ రాజకీయాలన్నీ లెక్కల చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగానే విషయాన్ని ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో అంతా అప్పులమయంగా మారిందని వివరించే ప్రయత్నం చేసింది. అయితే కాంగ్రెస్ సర్కార్ వెల్లడించిన అప్పుల లెక్కలను తప్పుల తడక అంటూ కొట్టిపారేసింది బీఆర్‌ఎస్. తమ హయాంలో చేసిన అప్పులతో ఆస్తుల కల్పన జరిగిందని అసెంబ్లీలోనే కౌంటర్ ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం లెక్కలన్నీ తప్పు అని చెప్పేలా స్వేదపత్రం విడుదల చేసింది గులాబీ పార్టీ. బీఆర్‌ఎస్ పాలనలో మూడు లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే దానిని 6 లక్షల 71 వేల కోట్లుగా ప్రభుత్వం చూపించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపామని… విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్లామని చెప్పారు. విద్యుత్, సాగునీరు,తాగునీరు రంగాల్లో బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో పెట్టిన పెట్టుబడులు, సృష్టించిన ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వడ్డించిన విస్తరి అని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలోని చిన్న మేడిగడ్డ బ్యారేజ్‌లో ఏదో తప్పు జరిగిందని నిందిస్తున్నారని… ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు.
కేటీఆర్ వాదనకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. చేసిన అప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఆస్తులను సృష్టించామని బీఆర్‌ఎస్ వాదిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొత్తంగా తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.50 లక్షల కోట్ల సంపద సృష్టించినట్లు కేటీఆర్ చెప్పారు. తాము చేసినవి చెప్పుకోకపోవడం వల్లే ఓటమి చెందామని.. అయినా ఇది తమకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని అన్నారు. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్ని లెక్కల చుట్టే తిరుగుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..