Telangana Sports Authority Chairman K Shiv Sena Reddy: తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుల సంక్షేమానికి, క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని స్పోర్ట్స్ అథారిటీ గౌరవాన్ని ఇనుమడింప చేసే విధంగా పక్కా ప్రణాళికతో, కార్యాచరణతో ముందుకెళ్తామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే. శివసేనారెడ్డి అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నూతన చైర్మన్‌గా ఈరోజు జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అందరి సలహాలు సూచనలతో, రాష్ట్రంలో అన్ని రంగాల్లో సమూల మార్పు తేవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషికి తోడ్పాటుగా క్రీడారంగంలో కూడా సమూల మార్పులు తీసుకురావడానికి తన పదవీకాలంలో నిరంతరం పాటు పడతానని ఆయన అన్నారు.
క్రీడల్లో ప్రోత్సాహానికి అధికప్రాధాన్యత దక్కే విధంగా,క్రీడా ప్రతి కార్యక్రమాలు యువతను భాగస్వామ్యంచేస్తూ సమగ్ర క్రీడా వికాసమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో క్రియాశీలకమైన క్రీడా వాతావరణం నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థను ఒక అత్యున్నతమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు టీంవర్క్‌తో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏ.పీ జితేందర్ రెడ్డి, శాసన సభ్యులు దానం నాగేందర్ టీ.మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, రాజయ్య, కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్లు కోచులు, సిబ్బంది ఒలంపిక్ అసోసియేషన్ కార్యవర్గం వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎన్.రమేష్ పలువురు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు.
రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన గచ్చిబౌలి స్టేడియంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..