
పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న ఏనుగులు తెలంగాణలో భీభత్సం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఏనుగు రైతును తొక్కి చంపి కలకలం రేపింది. అయితే ఏనుగులు ఎండ వేడమికో, దాహం తీర్చుకోవడానికి గ్రామాల్లోకి రావడం లేదట. జనావాసాల్లోకి రావడానికి ప్రత్యేక కారణం ఉందట. ఇటీవల మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాల ద్వారా ఏనుగులు ప్రాణహిత నది ఒడ్డున ఉన్న గ్రామాల్లోకి ఎంటర్ అయ్యింది. అయితే రైతులు సాగు చేస్తున్న పుచ్చకాయ, చెరకు పంటలకు ఆకర్షితమైంది. ఏనుగు నదిని దాటడం అదే మొదటిసారి కూడా. పుచ్చకాయ, చెరకు ఏనుగులకు ఇష్టమైన ఆహారమని, వాటిని సుదూర ప్రాంతాల నుంచి వాసన చూడొచ్చని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పెంచికల్ పేటలోని కొండపల్లి గ్రామంలో పుచ్చకాయ, బెజ్జూరు పట్టణ శివార్లలో రైతులు చెరకు సాగు చేస్తారు. సలుగుపల్లిలోని చెరకు పొలంలోకి ఏనుగు ప్రవేశించినప్పటికీ పంట చాలా చిన్నదిగా ఉంది.
ఇటీవల ఏప్రిల్ 4న పుచ్చకాయ పొలంలో పత్తి పంటకు నీరు పోస్తుండగా ఏనుగు రైతును తొక్కి చంపింది. అయితే పశ్చిమ బెంగాల్ కు చెందిన సేజ్ అనే స్వచ్ఛంద సంస్థ నిపుణుల సహాయంతో అటవీ శాఖ ఏనుగుల ప్రవర్తన, వాటిని ఎలా ఎదుర్కోవాలో సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ వో) ఏనుగు గతంలో పలుమార్లు ప్రాణహితకు చేరుకుందని, అయితే గడ్చిరోలి మీదుగా ఛత్తీస్ గఢ్ కు వెళ్లిందని తెలిపారు. ఏప్రిల్ 3న తొలిసారిగా తెలంగాణలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు ఏనుగు తిరిగి వచ్చినప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
బెజ్జూరు మండలం నాగపెల్లికి చెందిన కొడప శంకర్ మాట్లాడుతూ ప్రాణహిత వెంబడి ఉన్న ఇతర గ్రామాలతో పాటు కొండపల్లి ప్రాంతంలో రైతులు చెరకు, పుచ్చకాయ సాగు చేస్తున్నారన్నారు. సిద్దాపూర్, ఎల్కపల్లి గ్రామాల్లో చెరకు పండించేవారని, ఇటీవలి కాలం వరకు బెజ్జూర్ బెల్లం ఉత్పత్తి జరుగుతోందన్నారు. పెద్ద ఎత్తున అడవుల నరికివేత కారణంగా ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు.