
కరీంనగర్, డిసెంబర్ 8: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓ గ్రామపంచాయతీలో ఆడపిల్ల పుడితే రూ. పదివేలు ఫిక్స్ డిపాజిట్ చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఓటర్ల మన్ననలు దక్కించుకోవడానికి ఎలాగైనా భిన్నంగా కనిపించాలన్నదే నేతల మైండ్‌సెట్. ఎన్నికల వేళ వాగ్దానాలు కొత్తేమీ కావు. కానీ ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటినీ ఆర్థికంగా ఆదుకుంటామని ప్రచారం చేయడం విశేషం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్కొక్కరు భిన్నంగా ఓటర్లకు వాగ్దానాలు ఇస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరేపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఇటిక్యాల రాజు గ్రామంలో ఆడపిల్ల పుట్టితే తల్లిదండ్రుల ముఖంపై సంతోషం పూయాలి. ఆడపిల్ల ఆర్థిక భారంగా కారాదు. అందుకే సర్పంచ్‌గా గెలిస్తే… పుట్టిన ప్రతి ఆడపిల్లకు రూ.10,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తా అని హామీ ఇస్తున్నాడు. ఎన్నికల్లో హామీలు చాలా వింటాం.. కానీ సమాజంలో మార్పు తీసుకురావాలని చేసే ప్రయత్నాలు మాత్రం అరుదు. ఆడపిల్ల పుడితే ఆనందం. ఆ ఆనందానికి ఆర్థిక రక్షణ ఇవ్వాలన్న సంకల్పం ఇవ్వడంతో అది కాస్తా పెద్ద చర్చగా మారింది. ఈ వినూత్న ప్రచారం ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రతి ఇంటింటికి వెళ్లి ఇదే ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా స్పందన బాగానే వస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.