సెలవులు అంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. సెలవులు వస్తున్నాయంటే పిల్లల సంతోషానికి అవధులు ఉండవు. ఆలాంటి సెలవులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటారు. మరికొద్ది రోజుల్లో హాఫ్ డే స్కూల్స్ సెలవులు వస్తున్నాయని విద్యార్థులు సంబరపడుతున్నారు. కానీ ఓ విద్యార్థి మాత్రం సెలవులు అంటే బాధపడుతున్నాడు. ఎందుకు ఆ విద్యార్థి వేసవి సెలవులు వద్దంటున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరోవైపు రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 నుంచి 12:30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని హాఫ్ డే స్కూల్స్ షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. 12:30 గంటల తర్వాత పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుతం కొన్ని తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు కూడా జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం మునిపంపులకు చెందిన నగేష్, స్వాతి దంపతుల కొడుకు సాత్విక్. కొడుకు రెండేళ్ల వయసులోనే కుటుంబ విభేదాలతో తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో వలిగొండ మండలం ఇస్కిల్లాలోని అమ్మమ్మ వద్ద ఉంటూ 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత తండ్రి నగేష్ వద్దకు వెళ్ళి ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. అక్కడ అమ్మమ్మ, ఇక్కడ నానమ్మ వృద్దులే కావడంతో సాత్విక్ చదువుకు ఇబ్బందిగా మారింది. నకిరేకల్ మండలం మూసి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులంలో సీటు సంపాదించిన సాత్విక్ 8వ తరగతి చదువుతున్నాడు.
పిల్లలంతా హాఫ్ డే స్కూల్స్ కోసం ఎదురు చూస్తుండగా సాత్విక్ మాత్రం సెలవులు వద్దంటూ బాధపడుతున్నాడు. సాత్విక్ తన బాధను నోట్ బుక్ లో రాసుకున్నాడు. వేసవి సెలవుల్లో నేను ఇంటికి వెళితే నాకు అన్నం దొరకదు. నాకు ఇంటికి వెళ్లాలని లేదు. అమ్మమ్మ, నానమ్మలు పెన్షన్ డబ్బులతో బతుకుతున్నారు. వేసవి సెలవులు ఇవ్వకండి.. నేను బడిలోనే ఉంటాను.. అన్నం పెట్టండి అంటూ సాత్విక్ ఆ లేఖలో రాశాడు. కష్టపడి చదువుకుంటానని, ఉన్నత స్థాయికి ఎదుగుతానంటూ.. సాత్విక్ తన కష్టాలను రెండు పేజీల్లో పేర్కొన్నాడు. నోట్ బుక్‌లో రాసిన ఈ లెటర్ క్లాస్ టీచర్ కంట పడింది. ఈ లెటర్‌ను చూసి చలించిన క్లాస్ టీచర్.. సాత్విక్ ను పిలిపించుకొని అతడి పరిస్థితిని తెలుసుకొని బాధపడ్డారు. సాత్విక్‌కు దాతల సహాయం కోసం ఆ లెటర్‌ను క్లాస్ టీచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ లెటర్ నెటిజన్లను కదిలిస్తోంది. ఆట పాటల్లో సాత్విక్ ముందుండే వాడని.. చదువులో చక్కని ప్రతిభ కనబరుస్తున్నాడని టీచర్లు చెబుతున్నారు.