Municipal Elections 2021: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో మున్నిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మండే ఎండలు వైపు… మున్సిపల్ ఎన్నికల హీట్ మరోవైపు… తెలంగాణను మరింత కాక పుట్టిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ఓట్లు అడిగే అర్హత మీకెక్కడిదంటూ ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అభివృద్ధిపై చర్చలు ఏ సెంటర్‌లోనైనా సిద్ధమంటున్న పార్టీలు… వ్యక్తిగత విమర్శలకు దిగుతూ పొలిటికల్ కాక పెంచుతున్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వరంగల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి పార్టీలన్నీ. ఎలాగైనా గెలుపు జెండా ఎగరేయ్యాలని నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఆ దిశగానే ప్రత్యర్థి పార్టీలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా హన్మకొండ చౌరస్తా లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారంటూ గులాబీ నేతలు కళ్లురుముతున్నారు. ప్రధానమైన సంస్థలను ప్రైవేటుపరం చేసి రిజర్వేషన్లు ఎత్తేసేలా కేంద్రం కుట్ర చేస్తోందని హాట్‌కామెంట్స్ చేశారు మంత్రి ఎర్రబెల్లి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతలు వస్తే కేంద్రం ఇస్తామన్న ఉద్యోగాలు ఏవని నిలదీసి… డీజీల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించండని పిలుపునిచ్చారు ఎర్రబెల్లి.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆరేళ్లుగా వరంగల్ పట్టణం పాలకుల నిర్లక్ష్యానికి గురై అభివృద్ధి దూరంగా ఉందని… బీజేపీ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విపక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేసి వదిలేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ డబ్బు, మద్యంతో గెలవాలని చూస్తోందని…. కాంగ్రెస్‌కు ఓటేస్తే మురిగినట్టేనని కామెంట్స్ చేశారు. కరోనా కేసులు ప్రభుత్వం దాస్తోందని… దీని వల్ల కేంద్రం రావాల్సిన కొన్ని బెనిఫిట్స్ రాకుండా పోతాయని హెచ్చరించారు కిషన్ రెడ్డి.
ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీలో ఉన్నా ప్రచారం మాత్రం అంత అంత మాత్రంగానే సాగుతోంది. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికలు జరగనున్నాయి.