వరంగల్, జనవరి 09: అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి రోజుల్లో కూడా వింత ఆచారాలు, మూఢ నమ్మకాల జాడ్యం ఇంకా వీడడం లేదు… అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సోషల్ మీడియా ప్రచారాలు వూహించని విధంగా ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి. పండుగలు వస్తున్నాయంటేచాలు ఏదో ఒక వింత ప్రచారాలు జనాన్ని పరేషాన్ చేస్తూ.. పరుగులు పెట్టిస్తున్నాయి.. తాజాగా ఈసారి సంక్రాoతి పండుగను గాజుల గండం దడ పుట్టిస్తుంది.. ఊహించని విధంగా మహిళలు గాజుల దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్… త్వరలో సంక్రాంతి పండుగ రాబోతున్న వేల కొత్త పుకార్లు జోరందుకున్నాయి.. ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్ద డబ్బులు అడుక్కొని గాజులు వేసుకోవాలని ప్రచారం జరుగుతుంది…
ఈ ప్రచారం ఇప్పటికే పల్లెలు, పట్టణాలన్నా తేడాలేకుండా ప్రతీ ఇంటికీ చేరింది.. ఇంకేముంది… ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్దకు ఒక్క కొడుకున్న తల్లులు పరుగులు పెడుతున్నారు.. వారి వద్ద డబ్బులు తీసుకొని గాజులు వేసుకొని కీడు తొలగిపోవాలని వేడుకుంటున్నారు…
ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు కీడు వచ్చిందని… అందు కోసమే ఒక్క కొడుకు ఉన్న మహిళలు, ఇద్దరు అంతకంటే ఎక్కువమంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలని.. ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలని ప్రచారం జరుగుతుంది.. సంక్రాంతి పండగ లోపు ఐదు రకాల గాజులు ధరించాలని..లేకుంటే కీడు తప్పదని ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది..
ఆ కీడు ధరికూడదని తల్లడిల్లిపోతున్న తల్లులు ఇద్దరు కుమారులు కలిగిన తమ బంధువులు, ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. విద్యావంతులు కూడా కీడు భయంతో ఇదే ఆచరిస్తున్నారు.. పెద్దలు చెప్పిన సాంప్రదాయాన్ని ఆచరించాల్సిందే అంటున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మవద్దని వేద పండితులు, పురోహితులు సూచిస్తున్నారు.. పండుగలకు కీడు వస్తుందని.. ఇలాంటి గాజులు ధరిస్తే ఆ కీడు పోతుందని ఏ శాస్త్రంలో లేదని కొట్టి పారేస్తున్నారు.. ఇలాంటి ప్రచారాలతో ప్రజలను పరేషాన్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మొత్తం మీద గాజుల గండం….కీడు భయంతో గాజులు మాత్రం మస్త్ గిరాకీ పెరిగింది…
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..