
ఆహారం ఎంత స్వచ్ఛతగా ఉంటే ఆరోగ్యం కూడా అంతే భద్రంగా ఉంటుంది.. కానీ కల్తీ ఆహారాలు సమాజానికి ముప్పుగా మారుతున్నాయి. ప్రజల ప్రాణాలకు భద్రత కరువవుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే బూజుపట్టిన ముడి సరుకుతో పచ్చళ్లు తయారీచేస్తున్న వ్యాపారులు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వరంగల్ లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ప్రాణాంతక పచ్చళ్ళ తయారీ దందా గుట్టు రట్టయింది.. పోలీసులు భారీ ఎత్తున బూజుపట్టి కంపుకొడుతున్న పచ్చళ్లను సీజ్ చేయడం సంచలనంగా మారింది. వాస్తవానికి, మనం తినే ఆహారం రూపాయి తక్కువ వస్తుందంటేచాలు చాలామంది ఆకర్షితులవుతారు.. కాస్త తక్కువకు ధరకు లభిస్తుంది కదా అని తీసుకెళ్లి లొట్టలేసుకుంటూ తింటారు.. కానీ అవి ఎలాంటి అపరిశుభ్రతతో తయారు చేస్తున్నారు..! ఆ ఆహార పదార్థాల తయారీలో కనీస ప్రమాణాలు పాటిస్తున్నారా..! లేదా..! అని ఆలోచించేవారు చాలా అరుదు.. ఈ పచ్చళ్ళ తయారీ చూస్తే మీకే అర్దం అవుతుంది.. ఎలాంటి అపరిశుభ్రతతో పచ్చళ్ళు తయారు చేస్తున్నారో మీరే చూడొచ్చు… పైకి ఎర్రగా కనిపించే పచ్చళ్ళు అన్ని నాణ్యమైనవి అనుకుంటే ఎర్రటి కారం కంట్లో పడ్డట్లే.. ఇదెక్కడో కాదు.. వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో నిర్వహిస్తున్న పచ్చళ్ల దందా.. ఓ రేకుల షెడ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా ఇంత పెద్దఎత్తున పచ్చళ్ళ తయారీ దందా జరుగుతుంది. ప్లాస్టిక్ డ్రమ్ములలో పచ్చళ్ళు తయారుచేసి ఇలా నిలువ చేస్తున్న వ్యాపారులు వాటిని చిన్నచిన్న ప్లాస్టిక్ డబ్బాలలో నింపి విక్రయాలు జరుపుతున్నారు.. పచ్చళ్లు ఎక్కువ కాలం మన్నిక ఉండడం కోసం వెనిగర్ వాడుతున్నారు. పచ్చళ్ళ డబ్బాలకు వివిధ బ్రాండ్ల పేర్లు పెట్టి కర్రీ పాయింట్స్, చిన్నచిన్న కిరాణా షాప్స్, స్వీట్ హౌజ్ లలో విక్రయాలు జరుపుతున్నారు.. ఇంత దారుణంగా అపరిశుభ్రతతో తయారు చేస్తున్నారో తెలియని వినియోగదారులు కాస్త తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనుగోలు చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు..
వరంగల్ శివారులోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి పచ్చల తయారీ దందా జోరుగా సాగుతుంది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాశిబుగ్గ ప్రాంతంలో భారీఎత్తున తయారీకి సిద్ధంగా ఉన్న పచ్చళ్ళను సీజ్ చేశారు. డ్రమ్ములలోని పచ్చళ్లు.. అలాగే కుళ్ళి పోయిన వ్యర్ధాలు, దుర్వాసన.. పోలీసులు-ఫుడ్ సేఫ్టీ అధికారులను నివ్వెర పోయేలా చేశాయి.. ఎలాంటి అనుమతులు లేకుండా పరిశుభ్రత, ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్న పచ్చళ్ళ తయారీకేంద్రాలపై పోలీసులు, సంబంధిత అధికారులు నిర్వహిస్తున్న దాడులలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి..ధనార్జన కోసం నాణ్యతను తాకట్టుపెట్టే ఇలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
డ్రమ్ములలో మామిడి, టమాటా, ఉసిరి, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి లాంటి రకరకాల పచ్చళ్ళ తయారీకి సిద్ధం చేసుకున్నారు. ఏడాది కాలం పాటు కావాల్సిన ముడిసరుకు ముందే తయారుచేసి పెట్టుకున్నారు.. వాటిపై వెనిగర్ పౌడర్ వాడుతున్నారు.. అప్పటికే దుర్వాసనతో డ్రమ్ములపై భాగంలో బూజుపట్టి కనిపిస్తున్నాయి.. వీటిని ఎప్పటికప్పుడు మిక్స్ చేసి డబ్బాలలో నింపి వినియోగదారులకు అంట కడుతున్నారని.. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ డ్రమ్ములో భద్రపరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పోలీసులు తెలిపారు.
ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వ్యాపారులపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల వినియోగం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు, కాలేయం వ్యాధులు,ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు..