
చైనా మంజాలు మనుషులు, పక్షుల పాలిట ఉరితాళ్లు అవుతున్నాయి.. ఆకాశంలో నిర్లక్ష్యంగా వదిలేసిన చైనా మంజాలు పక్షుల ప్రాణాలు మింగేస్తున్నాయి.. మనుషుల ప్రాణాలు గాల్లో దీపంలా మార్చేస్తున్నాయి.. తాజాగా వరంగల్ బట్టలబజార్‌లో జరిగిన ఓ ఘటనలో చైనా మంజా చుట్టుకొని పావురం ప్రాణాలు గాలిలో దీపంలా మారింది.. మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలతో నేలపై పడిపోయిన ఆ పావురానికి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పునర్జీవాన్ని ప్రసాదించాడు..
చైనా మంజాల విక్రయాలు, వినియోగంపై ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా వాటి విక్రయాలు ఆగడం లేదు.. గాలిపటాలు ఎగిరేసే వారు మారడం లేదు.. చైనా మంజాను నిర్లక్ష్యంగా వదిలేయడంతో గాలిలో వేలాడుతున్న చైనా మంజాలు పక్షుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి.. మరోవైపు అభం శుభం ఎరుగని మనుషుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి
ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగరేసిన చైనా మంజాలు ఎంతోమందిని విగత జీవులుగా మార్చాయి.. కొందరికి గొంతు తెగి ఆస్పత్రి పాలయ్యారు.. కొన్ని ప్రాంతాల్లో పశు పక్ష్యాదులు బలయ్యాయి.
తాజాగా వరంగల్ బట్టలబజార్‌లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో చైనా మంజా చుట్టుకొని పావురం నేలపై పడింది.. పావురం రెక్కలకు మాంజా చుట్టుకొని గాయాలపాలైంది. మృత్యువుతో పోరాడుతున్న ఆ పావురాన్ని హఫీజ్ పాషా అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించి.. స్థానికుడు నాగపూరి శ్రీధర్ సహాయంతో ఆ పావురానికి ప్రాణం పోశారు. చైనా మాంజాలను ఎవరూ ఇలా నిర్లక్ష్యంగా వదిలేసి పశు పక్షాదులు, మనుషుల ప్రాణాలకు ముప్పు తేవద్దని కోరారు.