Telangana: చేతబడి చేసిన కోడిగుడ్లు గుటుక్కున మింగేసిన పోలీస్.. ఆపై అక్కడి కొబ్బరి నీళ్లతో దాహం తీర్చుకున్నాడు

|

Mar 14, 2022 | 7:47 PM

ఆ రహదారి క్షుద్ర పూజలకు కేరాఫ్ గా మారింది.. ఆదివారం- బుధవారం వచ్చిందంటే చాలు అక్కడ నిమ్మకాయలు, కొబ్బరి కాయలు, క్షుద్రపూజల ఆనవాళ్లు స్థానికులకు వణుకు పట్టిస్తున్నాయి.. ఆ పూజలు చూసి బేజారవుతున్న ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పోలీసులు ఏం చేశారో తెలుసా..?

Telangana: చేతబడి చేసిన కోడిగుడ్లు గుటుక్కున మింగేసిన పోలీస్.. ఆపై అక్కడి కొబ్బరి నీళ్లతో దాహం తీర్చుకున్నాడు
Warangal Police Great Job
Follow us on

ఓ వైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఆకాశంలో అద్భుతాలు చేస్తున్నాం. మహమ్మారి కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) కనిపెట్టాం. కానీ.. మూఢనమ్మకాలకు ముగింపు పలకలేకపోతున్నాం.  క్షుద్రపూజలు(Black Magic) చేస్తున్నారని వారిని హత్య చేసిన ఉదంతాలు.. క్షుద్రపూజల పేరిట కొందరు మోసం చేసిన ఘటనలు కూడా గతంలో ఎన్నో వెలుగుచూశాయి. ముఖ్యంగా పల్లెల్లో, తండాల్లో ఈ భయాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా ఆది, బుధ వారాలు వచ్చాయంటే చాలు ఏదో ఒకచోట క్షుద్ర పూజలు, చేతబడి చేస్తున్నారు. అనుకోకుండా వాటిపై నుంచి దాటడంతో అనారోగ్యానికి గురవుతామని అనుమానంతో జనం భయపడిపోతున్నారు. ఈ ఘటనపై అటు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా మంత్రగాళ్లు క్షుద్రపూజలు, చేతబడి పూజలు చేయడం మానడం లేదు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా.. ఇంకా మంత్రాలు, క్షుద్రపూజలు అంటూ ఎక్కడికి వెళ్తున్నామని విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ పోలీస్ అధికారి ప్రజలకు అవగాహాన కల్పించేందుకు ఎవరూ సాహసించని పనికి పూనుకున్నాడు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

వరంగల్ బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆది, బుధవారాల్లో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నారు. కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు వేయడం వల్ల వాహనదారులు భయపడుతున్నారు. విషయం తెలుసుకున్న వరంగల్ ట్రాఫిక్ సీఐ నరేష్.. బ్రిడ్జిపై పూజలు చేసి వదిలేసిన కొబ్బరికాయలు, కోడిగుడ్లు, నిమ్మ కాయలు, పూజ సామగ్రి అంతా ఒక్కచోటకు చేర్చారు.. ప్రజలంతా చూస్తుండగానే నారాయణ అనే హోం గార్డ్ వాటిని గుటగుటా మింగేశాడు.
కోడి గుడ్డు గుటుక్కున మింగేసిన హోమ్ గార్డ్.. కొబ్బరి కాయ పగలగొట్టి ఆ కొబ్బరి నీళ్లతో దాహం తీర్చుకున్నాడు.. అంతేకాదు పూజలు చేసిన ఆ నిమ్మకాయలను కోసి నిమ్మరసం తాగేశాడు. ఈ కార్యక్రమం ద్వారా మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు… ఇలాంటి చిల్లర పనులు చేస్తూ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఏది ఏమైనా క్షుద్రపూజలు అనగానే హడలెత్తిపోయే ప్రజలకు ఈ అవగాహన కార్యక్రమంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది.

 

—పెద్దేశ్ కుమార్, వరంగల్

Also Read: ‘మత్స్యకన్య’ ! కోతి-చేప కలయికే కారణమా..? మతి పోగొట్టే విషయాలు !