పరీక్షల వేళ పోలీసుల సంచలన నిర్ణయం.. ఇకనుంచి డీజే సౌండ్స్ పెడితే జైలుకే..

పరీక్షల వేళ వరంగల్ నగరంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. డీజే సౌండ్స్ ఉపయోగిస్తే పోలీస్ మార్క్ ఉంటుందని, శబ్ద కాలుష్యం సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు శుభకార్యాలు - మరోవైపు పరీక్షల పరేషాన్ వేళ డీజే సౌండ్స్ పై పోలీసులు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.

పరీక్షల వేళ పోలీసుల సంచలన నిర్ణయం.. ఇకనుంచి డీజే సౌండ్స్ పెడితే జైలుకే..
Dj Ban

Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 04, 2025 | 4:52 PM

పరీక్షల వేళ వరంగల్ నగరంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. డీజే సౌండ్స్ ఉపయోగిస్తే పోలీస్ మార్క్ ఉంటుందని, శబ్ద కాలుష్యం సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు శుభకార్యాలు – మరోవైపు పరీక్షల పరేషాన్ వేళ డీజే సౌండ్స్ పై పోలీసులు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం (మార్చి 5) నుంచి ప్రారంభం కానున్నాయి.. పదవ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి.. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న వేళ డీజే సౌండ్స్ మోతలు ఊహించిన విధంగా ఇబ్బందులు కలిగిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసులు డీజే సౌండ్ పై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై నగరంలో డీజే సౌండ్స్ పై ఖాకీ మార్క్ ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.. పెళ్లి వేడుకలు, ఇతర శుభకార్యాలు, ర్యాలీలలో డీజే సౌండ్స్ సిస్టమ్ ఉపయోగిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు డిజె సౌండ్స్ సిస్టమ్ నిర్వాహకులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు.. ఆ డీజే సౌండ్ సిస్టం కూడా సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు ఇతర పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్న వేళ వారికి డిజె సౌండ్స్ వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ప్రజల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో డీజే సౌండ్స్ పై నిషేధం విధిస్తున్నామని హెచ్చరించారు.. ఎవరైనా పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ ప్రకటించారు.

డిజే సౌండ్స్, ఇంకా శబ్ద కాలుష్యం విషయంలో ఏమైనా సమస్యలుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నందిరామ్ నాయక్ సూచించారు. కాగా.. పోలీసుల నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..