Telangana: పార్లమెంట్ ఎన్నికలకు ముందే వేడెక్కిన రాజకీయాలు.. ఈ జిల్లా నేతల మధ్య మాటల తూటాలు..

| Edited By: Srikar T

Jan 23, 2024 | 11:01 AM

పార్లమెంటు ఎన్నికలకు ముందే ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రులు, మాజీ 'మంత్రి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. దీనికి ప్రతిగా మంత్రి కోమటిరెడ్డి విమర్శల దాడి చేయడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. శాసనసభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ స్వీప్ చేయాలని భావిస్తోంది.

Telangana: పార్లమెంట్ ఎన్నికలకు ముందే వేడెక్కిన రాజకీయాలు.. ఈ జిల్లా నేతల మధ్య మాటల తూటాలు..
Telangana Ministers
Follow us on

పార్లమెంటు ఎన్నికలకు ముందే ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రులు, మాజీ ‘మంత్రి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. దీనికి ప్రతిగా మంత్రి కోమటిరెడ్డి విమర్శల దాడి చేయడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. శాసనసభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 11 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రెండు పార్లమెంట్ స్థానాలను తిరిగి నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ దూకుడు పెంచింది. కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో టిక్కెట్ దక్కించుకుంటే గెలుపు ఖాయమనే అంచనాలో ఆశావాహులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీలో చాలామంది ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలపై తీవ్ర కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‎లో రెండు స్థానాలకు ఇద్దరు మంత్రులు ఇన్ చార్జులుగా ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికలో దెబ్బతిన్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్మేల్ గెలువడం, ఒక్క సూర్యాపేటలోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గెలుపొందారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశలో ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో అయినా విజయం సాధించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. నల్గొండ పార్లమెంటుకు మాజీ మంత్రి జగదీశెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటి వరకు నల్గొండ స్థానంలో బీఆర్ఎస్‎కు విజయం దక్కలేదు. దీంతో తాజాగా హైదరాబాద్‎లో జరిగిన పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ముఖ్యకార్యకర్తలు, నాయకులకు పార్టీ అధిష్టానం.. ఎన్నికలపై పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని, గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి మరింత ఉదృతంగా వెళ్లాలని సూచించింది.

ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరో రెండు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయి చేరుకున్నాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ అప్పట్లో మంత్రిగా పని చేసిన జగదీశ్ రెడ్డిపై నల్గొండ, భువనగిరి ఎంపీలుగా ఉన్న ఉత్తమ్, కోమటిరెడ్డిలు తీవ్రంగా విమర్శించేవారు. గతంలోనూ పలుమార్లు జడ్పీ సమావేశంలో మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం వానాకాలం పంటల సాగు సమీక్ష సమావేశంలోనూ ఉత్తమ్, జగదీశ్ రెడ్డిమధ్య మాటల యుద్ధం నడిచింది. ఇటీవల ఎన్నికల ప్రచారం పలు సందర్భాల్లో తమకు ఉమ్మడి జిల్లాలో జగదీశ్ రెడ్డియే ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విమర్శల పరంపర ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఇవి కూడా చదవండి

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని చెబుతున్నారు. మాజీమంత్రి జగదీష్ రెడ్డికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం తర్వాత అరెస్టు అయ్యే రెండో వ్యక్తి జగదీశ్ రెడ్డి అని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. తాము అనుకుంటే నెల రోజుల్లోనే బీఆర్ఎస్‎ను 39 ముక్కలు చేస్తాం. కానీ మాకు అలాంటి సంస్కృతి లేదంటూ విమర్శల దాడిని పెంచారు. మాజీ మంత్రి కేటీఆర్, జగదీష్ రెడ్డిలు ఆహంకారం తగ్గించుకుంటే మంచిదని కోమటిరెడ్డి హితవు పలికారు. బీఆర్ఎస్‎ను ముక్కలు చేయడం కోమటిరెడ్డి తాతతరం కూడా కాదని, వాళ్ల పాత బాస్ వైఎస్..ప్రస్తుత బాస్ చంద్రబాబు ఇద్దరు కలిసి కూడా బీఆర్ఎస్‎ను ఏం చేయలేకపోయారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రతి విమర్శ చేశారు. కోమటి రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదని జగదీశ్ రెడ్డి విమర్శించారు. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..