నువ్వా..నేనా.. రోడ్డుపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ల రేసు.. వీడియో వైరల్‌!

ఆర్టీసీ ప్రయాణం అంటేనే ప్రయాణికుల భద్రత.. అలాంటిది ఇక్కడ కొందరు ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను పోటాపోటీగా నడుపుతూ ప్రయాణికులను భయాందోళనలకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట-హుజురాబాద్ రహదారిపై వెలుగు చూసింది.

నువ్వా..నేనా.. రోడ్డుపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ల రేసు.. వీడియో వైరల్‌!
Rtc Bus Drivers' Reckless Race

Updated on: Aug 13, 2025 | 9:26 PM

ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్‌లు పోటాపోటీగా బస్సులను నడుపుతూ ప్రయాణికులను హడలెత్తించిన ఘటన రీంనగర్ జిల్లా జమ్మికుంట-హుజురాబాద్ రహదారిపై వెలుగు చూసింది. ముగ్గురు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తమ బస్సులను ఒకదానితో ఒకటి పోటీ పడుతూ రేసింగ్ జరిపిన తీరు ప్రయాణికులను, రోడ్లపై వెళ్తున్న వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. హుజురాబాద్ డిపోకు చెందిన మూడు ఆర్టీసీ బస్సులు జమ్మికుంట నుండి హుజురాబాద్‌కు బయల్దేరాయి. మార్గమధ్యలోకి రాగానే మూడు బస్సులు ఒకే పాటిగా ప్రాయణించడం స్టార్ట్‌ చేశాయి. ఈ క్రమంలో ముగ్గురు డ్రైవర్లు ఒకరినొకరు క్రాస్‌ చేసి ముందుకు వెళ్లేందుకు తీవ్రంగా పోటీపడ్డారు.

మూడు బస్సులు ఒకదాన్ని మరొకటి ఓవర్‌టేక్ చేసేందుకు రహదారి మొత్తాన్ని ఆక్రమించాయి. ఈ ప్రయత్నంలో వెనక వచ్చే వాహనాలకు దారివ్వకుండా, రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేస్తూ ముందుకు దూసుకెళ్లాయి. వీళ్ల ప్రమాధకర డ్రైవింగ్‌ను చూసి బస్సులోని ప్రయాణికులతో పాటు వెనక వస్తున్న వాహనదారులు కూడా తీవ్ర భయందోళనకు గురయ్యారు. ఈ రేస్‌కు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది.

మరోవైపు ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు డ్రైవర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లే వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి ఇలా బాధ్యతారహితంగా డ్రైవింగ్‌ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్లే ఇంత నిర్లక్ష్యంగా వాహనాలను నడిపితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించి ఆ ముగ్గురు డ్రైవర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.